ఆసీస్‌ డబుల్‌ ధమాకా

Australia Ranked Number One In Test And T20 Rankings - Sakshi

టెస్టు, టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ సొంతం

టెస్టుల్లో చేజారిన టీమిండియా ‘టాప్‌’ ర్యాంక్‌

దుబాయ్‌: టీమిండియా ఇప్పుడు గదధారి కాదు. ఇంటా బయటా నిలకడైన విజయాలతో టెస్టుల్లో నాలుగేళ్లుగా ఎదురులేని జట్టుగా కొనసాగిన భారత్‌ అగ్రస్థానం చేజారింది. కొత్త లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా (116 పాయింట్లు) టాప్‌ ర్యాంకుకు చేరగా... న్యూజిలాండ్‌ (115) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌ (114) మూడో ర్యాంకుకు పడిపోయింది. అయితే 2003లో టెస్టు ర్యాంకుల్ని ప్రవేశపెట్టాక టాప్‌–3 జట్ల మధ్య మరీ ఇంత అత్యల్ప వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి. కోహ్లి సేన 2016–17 సీజన్‌ నుంచి చక్కని ప్రదర్శనతో వరుసబెట్టి  ఒక్కో సిరీస్‌ గెలుస్తూ వచ్చింది.

దీంతో ‘టాప్‌’ ర్యాంకును చేరుకోవడంతోపాటు ఇన్నాళ్లూ పదిలపరుచుకుంది. అలా ఒకటో నంబర్‌ జట్టుగా గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. ఈ తాజా విజయాలకు 100 శాతం పాయింట్లు, గత రెండేళ్లకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. దీంతో ఆసీస్‌ ముందంజ వేయగా... భారత్‌ మూడో స్థానానికి పడిపోక తప్పలేదు. అయితే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాత్రం భారతే ముందుంది.

టి20ల్లో పాక్‌ నాలుగో స్థానానికి... 
మరోవైపు టి20 ర్యాంకింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా ముందంజ వేసింది. 2011లో టి20 ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టాక ఆస్ట్రేలియా జట్టు (278 పాయింట్లు) తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. గత 27 నెలలుగా ‘టాప్‌’ ర్యాంక్‌లో కొనసాగుతున్న పాకిస్తాన్‌ 260 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌ (268 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, భారత్‌ (266 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌ 127 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్‌ రెండో స్థానంలో, న్యూజిలాండ్‌ మూడో స్థానంలో ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top