న్యూజిలాండ్ ఎదురీత | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ ఎదురీత

Published Sat, Nov 7 2015 1:28 AM

న్యూజిలాండ్ ఎదురీత

తొలి ఇన్నింగ్స్‌లో 157/5
     ఆసీస్‌తో తొలి టెస్టు

 
 బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తడబడింది. ఆతిథ్య పేసర్లను ఎదుర్కొలేక ఒత్తిడిలో పడింది. దీంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. విలియమ్సన్ (55 బ్యాటింగ్), వాట్లింగ్ (14 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. టీ విరామానికి కొద్ది ముందు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్ ఓపెనర్లలో గుప్టిల్ (23) విఫలమైనా... లాథమ్ (47) మెరుగ్గా ఆడాడు. మిడిలార్డర్‌లో టేలర్ (0), మెకల్లమ్ (6), నీషమ్ (3) నిరాశపర్చారు. ఓవరాల్‌గా 25 బంతుల్లో నాలుగు వికెట్లు పడటంతో కివీస్ 118 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. స్టార్క్, జాన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం కివీస్ ఇంకా 399 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు 389/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను 130.2 ఓవర్లలో 4 వికెట్లకు 556 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజా (174; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపాడు. స్మిత్ (48)తో కలిసి మూడో వికెట్‌కు 88; వోజెస్ (83 నాటౌట్; 11 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 157 పరుగులు సమకూర్చడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. సౌతీ, బోల్ట్, నీషమ్, విలియమ్సన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
 

Advertisement
Advertisement