మూడో టి20లోనూ న్యూజిలాండ్‌పై భారత్‌దే గెలుపు
టీమిండియా 3–0తో సిరీస్ సొంతం
కూల్చేసిన బుమ్రా దంచేసిన అభిషేక్, సూర్య
28న విశాఖలో నాలుగో మ్యాచ్
గువాహటి: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా... ఐదు టి20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మూడో టి20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో కివీస్‌పై గెలుపొందింది. 3–0తో సిరీస్‌ను వశం చేసుకుంది.
టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చాప్‌మన్ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ సాంట్నర్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ప్రపంచకప్‌కు ముందు ప్రీమియం బౌలర్ బుమ్రా (3/17) తన పేస్ వాడి ఏంటో నిలకడగా చూపించాడు.
హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.అనంతరం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ సూర్యకుమార్ (26 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో స్టేడియాన్ని ఊపేశారు. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది.
అభి‘షో’... 14 బంతుల్లో ఫిఫ్టీ!
తొలి బంతికే సామ్సన్ (0) క్లీన్‌బౌల్డ్... ఈ మ్యాచ్‌లో కివీస్ శిబిరం సంతోషించిన క్షణమిదే! తర్వాత గడిచిన క్షణాలు... పడిన బంతులు... వేసిన బౌలర్లు... పడిన పాట్లు... అన్ని ఇన్నీ కావు మరి! ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో బంతికి సిక్స్‌తో మొదలుపెట్టిన విధ్వంసం... అతను అవుటైనా కూడా ప్రతి ఓవర్లోనూ కొనసాగింది.
ఓపెనర్ అభిషేక్, కెప్టెన్ సూర్యకుమార్ ‘హైలైట్స్’నే ఇన్నింగ్స్ అసాంతం చూపించారు. అభి, ఇషాన్, సూర్య ముగ్గురు కలిసి 10 సిక్స్‌లు బాదారు. అంటే సగటున ఓవర్‌కు ఒక్కోటి వచ్చింది. బౌండరీలైతే 16! ఎంత సులువుగా వచ్చాయంటే! ప్రత్యర్థి ఫీల్డర్లు, బౌలర్లు మొత్తం 20 ఓవర్లు కష్టపడకుండానే సగం ఓవర్లతోనే ముగించేలా బౌండరీల భరతం పట్టారు భారత బ్యాటర్లు.
ఈ క్రమంలో అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. సూర్య 25 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు కేవలం 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. 3.1 ఓవర్లో 50 దాటిన భారత్ స్కోరు 6.3 ఓవర్లలో వందకు చేరుకుంది. 9.5 ఓవర్లలో 150ని సైతం అధిగమించింది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్ 1; సీఫర్ట్ (బి) బుమ్రా 12; రచిన్ (సి) బిష్ణోయ్ (బి) పాండ్యా 4; ఫిలిప్స్ (సి) ఇషాన్ (బి) బిష్ణోయ్ 48; చాప్‌మన్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 32; మిచెల్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 14; సాంట్నర్ (సి) అభిషేక్ (బి) బుమ్రా 27; జేమీసన్ (బి) బుమ్రా 3; హెన్రీ (రనౌట్) 1; ఇష్ సోధి (నాటౌట్) 2; డఫీ (నాటౌట్) 4: ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–2, 2–13, 3–34, 4–86, 5–112, 6–112, 7–132, 8–134, 9–144. బౌలింగ్: హర్షిత్ రాణా 4–0–35–1, హార్దిక్ పాండ్యా 3–0–23–2, రవి బిష్ణోయ్ 4–0–18–2, బుమ్రా 4–0–17–3, కుల్దీప్ 3–0–32–0, శివమ్ దూబే 2–0–24–0.
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) హెన్రీ 0; అభిషేక్ శర్మ (నాటౌట్) 68; ఇషాన్ (సి) చాప్‌మన్ (బి) సోధి 28; సూర్యకుమార్ (నాటౌట్) 57; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–53. బౌలింగ్: హెన్రీ 2–0–28–1, డఫీ 2–0–38–0, జేమీసన్ 1–0–17–0, ఇష్ సోధి 2–0–28–1, సాంట్నర్ 2–0–28–0, ఫిలిప్స్ 1–0–16–0.


