ఆ తప్పిదం నాదే: అశ్విన్‌

Ashwin blames himself for Shami s no ball of Andre Russell - Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన చిన్నపాటి తప్పిదం మొత్తం మ్యాచ్‌నే చేజారేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే జరిగిన తప్పిదానికి పూర్తి బాధ్యత తనదేనని పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఆ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మహ్మద్ షమీ విసిరిన యార్కర్‌కి రస్సెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. టీ20ల్లో తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) ముగిసిన తర్వాత 20 ఓవర్ల వరకూ 30 యార్డ్ సర్కిల్‌లో కనీసం నలుగురు ఫీల్డర్లు ఉండాలి.కానీ, షమీ బౌలింగ్‌లో ఆండ్రీ రస్సెల్ బౌల్డ్‌ అయిన సమయంలో 30 యార్డ్ సర్కిల్‌లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండటాన్ని అశ్విన్ గమనించలేదు. దీంతో థర్డ్ అంపైర్‌తో సమీక్షించిన ఫీల్డ్ అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
(ఇక్కడ చదవండి: కోల్‌కతా కుమ్మేసింది )

దీనిపై అశ్విన్ మాట్లాడుతూ.. ‘ నో బాల్ పూర్తి బాధ్యత నాదే. ఆ సమయంలో నేను ప్రతీ విషయాన్ని గమనించాల్సింది. మ్యాచ్ క్లిష్టంగా ఉన్నప్పుడు తరుచూ ఫీల్డర్లను మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో నేను గమనించలేకపోయా. మా జట్టు  అప్రమత్తంగా లేదు. చాలా చిన్న చిన్న తప్పులు చేశాం. దాని వల్ల చాలా మూల్యం చెల్లించుకున్నాం.  వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు ఇవ్వడంలో అతని తప్పు లేదు. ఇది అతనికి మొదటి మ్యాచ్ మాత్రమే’ అని అశ్విన్ అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top