టి20 ప్రపంచకప్‌కు అరుంధతి రెడ్డి 

Arundhati reddy cricketer select to womens t20 team - Sakshi

వచ్చే నెలలో విండీస్‌లో మెగా టోర్నీ  

న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన మీడియం పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి చోటు దక్కించుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో అరంగేట్రం చేసి మెరుగ్గా రాణించడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది. వెస్టిండీస్‌ వేదికగా నవంబర్‌ 9 నుంచి 24 వరకు ఐసీసీ మహిళల టి20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆలిండియా మహిళల సెలక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనుండగా... ఓపెనర్‌ స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇప్పటికే జట్టులో సీనియర్‌ హైదరాబాదీ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ ఉండగా... ఇప్పుడు తాజాగా మరో హైదరాబాదీ అరుంధతికి తొలిసారి వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశం దక్కింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ గ్రూప్‌ ‘బి’లో ఉంది. ఇదే గ్రూప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్‌ నవంబర్‌ 9న న్యూజిలాండ్‌తో, 11న పాక్‌తో, 15న ఐర్లాండ్‌తో, 17న ఆస్ట్రేలియాతో తలపడనుంది. మ్యాచ్‌లు గయానా
స్టేడియంలో జరుగనున్నాయి. 

భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తానియా (వికెట్‌ కీపర్‌), పూనమ్‌ యాదవ్, రాధా యాదవ్, అనూజ పాటిల్, ఏక్తా బిష్త్, హేమలత, మాన్సి, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top