సచిన్‌, రిచర్డ్స్‌లకు ఇది మరిచిపోలేని రోజు

April 15 Is Special Day For Sachin Tendulkar And Vivian Richards - Sakshi

క్రికెట్‌ ప్రపంచంలో ఈ ఇద్దరి పేర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరు క్రికెట్‌ ప్రపంచంలో తమ ముద్రను ఎప్పుడో వేశారు. అందులో ఒకరు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అయితే మరొకరు విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌. ఈ ఇద్దరు కలిసి మ్యాచ్‌లు తక్కువే ఆడినా ఎవరికి వారు సాటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరు తమ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. అయితే సచిన్‌, రిచర్డ్స్‌లకు ఏప్రిల్‌ 15 ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుంది. ఒకరు ఐపీఎల్‌లో తన మెయిడెన్‌ సెంచరీ సాధిస్తే, మరొకరు 34 ఏళ్ల క్రితం టెస్టు మ్యాచ్‌లో 56 బంతుల్లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు.(‘ధోని.. అయామ్‌ ఈగర్లీ వెయిటింగ్‌’)

వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన సచిన్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే మూడేళ్ల నుంచి ఐపీఎల్‌లో ఆడుతన్నా సెంచరీ సాధించలేకపోయాననే లోటు మాత్రం సచిన్‌కు అలాగే ఉండేది. కానీ అది ఏప్రిల్‌ 15, 2011తో తీరిపోయిందనే చెప్పాలి. కొచ్చి టస్కర్స్‌ కేరళతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 66 బంతుల్లోనే 100 పరుగులు చేసి మునుపటి సచిన్‌ను గుర్తు చేశాడు.  ఆ మ్యాచ్‌లో డేవిస్‌ జాకబ్స్‌, అంబటి రాయుడులు సచిన్‌కు మంచి సహకారం అందించారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. కాగా సచిన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 78 మ్యాచ్‌లాడి 2334 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్థ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్‌ టెండూల్కర్‌ 2013లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు.

ఇక మరొక అద్బుతం 1986లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటుచేసుకుంది. ఐదో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 26 పరుగులు చేసిన వివ్‌ రిచర్డ్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూనకం వచ్చినట్లుగా ఆడాడు. వన్డే మ్యాచ్‌ను తలపిస్తూ సాగిన ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లోనే 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని దాటికి ఇంగ్లండ్‌ ముంగిట 401 పరుగుల విజయలక్ష్యం వచ్చి చేరింది. అయితే విండీస్‌ భీకర బౌలింగ్‌ దాటికి 170 పరుగులకే ఆలౌట్‌ అయిన ఇంగ్లండ్‌ మ్యాచ్‌తో పాటు 5-0 తేడాతో సిరీస్‌ను విండీస్‌కు అప్పగించేసింది. ఈ మ్యాచ్‌ తన కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోతుందని రిచర్డ్స్‌ ఇప్పటికే చాలా ఇంటర్య్వూల్లో చెప్పుకొచ్చాడు.  విండీస్‌ దిగ్గజం తన కెరీర్‌ మొత్తం ఆద్యంతం దూకుడుగానే ఆడడం విశేషంగా చెప్పుకోవచ్చు. 121 టెస్టుల్లో 8540 పరుగులు చేసిన విండీస్‌ దిగ్గజం వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. కాగా, టెస్టుల్లో రిచర్డ్స్​ వేగవంతమైన శతకం రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు మెక్​కలమ్ బద్దలుకొట్టాడు. 2016లో క్రైస్ట్​చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టులో 54 బంతుల్లోనే మెక్​కలమ్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top