విజయం దిశగా ఆంధ్ర

 Andhra Team Lead In Ranji Trophy - Sakshi

రికీ భుయ్‌ అజేయ సెంచరీ

హడలెత్తించిన స్టీఫెన్, శశికాంత్‌

రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 89/6

సాక్షి, ఒంగోలు టౌన్‌: రికీ భుయ్‌ (313 బంతుల్లో 144 నాటౌట్‌; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు... బౌలింగ్‌లో చీపురుపల్లి స్టీఫెన్‌ (4/47), శశికాంత్‌ (2/24) హడలెత్తించడంతో... ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర విజయం దిశగా సాగుతోంది. 153 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే మరో 64 పరుగులు చేయాలి. ప్రస్తుతం లలిత్‌ యాదవ్‌ (23 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), వికాస్‌ మిశ్రా (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

నేడు మ్యాచ్‌కు చివరి రోజు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 249/6తో బ్యాటింగ్‌ కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 127 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆంధ్రకు 153 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఒకదశలో 8 వికెట్లకు 250 పరుగులతో ఉన్న ఆంధ్ర జట్టుకు ఆధిక్యం 50 పరుగులు దాటుతుందో లేదో అనే అనుమానం కలిగింది. అయితే రికీ భుయ్‌ పట్టుదలతో ఆడి చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ స్టీఫెన్‌ (60 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 76 పరుగులు... విజయ్‌ కుమార్‌ (20 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి పదో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఆంధ్రకు భారీ ఆధిక్యం లభించడంలో కీలకపాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top