ఐపీఎల్‌-11లో అంబటి రాయుడు..

Ambati Rayudu Scoring Century and duck vs same team in this IPL season - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కొత్త-చెత్త రికార్డులు నమోదు కావడం సర్వసాధారణం. తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు అంబటి రాయుడు ఒక రికార్డును లిఖించాడు. ఒక సీజనులో ఒక జట్టు మీద సెంచరీ నమోదు చేసి, మళ్లీ అదే జట్టు మీద మరో మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ బాట పట్టిన ఆటగాళ్ల జాబితాలో రాయుడు చేరిపోయాడు. ఈ ఐపీఎల్‌ లీగ్‌ దశలో ఇదే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది జట్టుకు భారీ స్కోరు అందించిన రాయుడు.. తర్వాత ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో భాగంగా క్వాలిఫయనర్‌-1లో పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ బాట పట్టాడు.

అయితే ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ అందరికంటే ముందున్నాడు. 2009లో డేర్‌డెవిల్స్‌కు ఆడిన డివిలియర్స్‌.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో శతకం(105నాటౌట్‌) సాధించాడు, ఆ తర్వాత అదే చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఆపై డేవిడ్‌ వార్నర్‌ ఉన్నాడు. 2010 ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరపున ఆడిన వార్నర్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకంతో చెలరేగగా, ఇదే కోల్‌కతాతో జరిగిన మరో మ్యాచ్‌లో మాత్రం పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ బాట పట్టాడు.

2011లో క్రిస్‌ గేల్‌(ఆర్సీబీ) కూడా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో.. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్(కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌) సైతం రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయగా, అదే జట్టుతో మరో మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాట పట్టారు. ఇక 2012లో సీఎస్‌కేఆటగాడు మురళీ విజయ్ డేర్‌డెవిల్స్‌తో.. 2016లో ఆర్‌సీబీ సారథి విరాట్‌ కోహ్లి గుజరాత్‌ లయన్స్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో శతకం బాదగా, మరో మ్యాచ్‌లో డకౌట్లగా నిష్క్రమించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top