అలెస్టర్‌ కుక్‌ వరల్డ్‌ రికార్డు

Alastair Cook carries bat with 244 not out to break 45 year old record - Sakshi

మెల్‌బోర్న్‌: ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెస్టర్‌ కుక్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్ లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించి  కడవరకూ అజేయంగా నిలవడమే కాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మెల్ బోర్న్ లో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుక్‌(244 నాటౌట్‌; 409 బంతుల్లో 27 ఫోర్లు) ద్విశతకం సాధించి అజేయంగా నిలిచాడు. తద్వారా 45 ఏళ్ల రికార్డును కుక్ బ్రేక్ చేశాడు. అంతకుముందు 1972లో న్యూజిలాండ్ ఓపెనర్ గ్లెన్  టర్నర్స్(223 నాటౌట్) ఓపెనర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగా, దాన్ని  కుక్ బద్ధలు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు.

మరొకవైపు ఇంగ్లండ్ తరపున ఓపెనర్ గా వచ్చి అజేయంగా నిలవడం 20 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 1997లో న్యూజిలాండ్ జరిగిన టెస్టు మ్యాచ్ లో మైక్ అథర్టన్(94 నాటౌట్) ఈ ఘనత సాధించాడు. ఆ తరువాత ఇంతకాలానికి అథర్టన్ సరసన కుక్ నిలిచాడు. తాజా టెస్టు మ్యాచ్ లో కుక్ డబుల్ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 491 పరుగులు చేసింది.  ఆపై రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. వార్నర్(40 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (25 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top