అలిస్టర్‌ కుక్‌ అల్విదా

Alastair Cook announces retirement from international cricket - Sakshi

రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌

భారత్‌తో జరిగే ఐదో టెస్టు చివరిది

అత్యధిక పరుగుల జాబితాలో  ఆరో స్థానం 

లండన్‌: టెస్టు క్రికెట్‌లో అసాధారణ ఘనతలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌ కుక్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత్‌తో శుక్రవారం నుంచి ఓవల్‌ మైదానంలో జరిగే టెస్టు తర్వాత రిటైర్‌ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. గత కొంత కాలంగా ఘోరంగా విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలైన కుక్‌ ఇక ఆడలేనంటూ తప్పుకున్నాడు. వయసు 33 ఏళ్లే అయినా, అతని తాజా ఫామ్‌ చూస్తే రిటైర్మెంట్‌ ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదు. కెరీర్‌ మొత్తంగా చూస్తే అద్భుత రికార్డు ఉన్న కుక్‌ బ్యాటింగ్‌ 2018లో పేలవంగా సాగింది. 9 టెస్టుల్లో 16 ఇన్నింగ్స్‌లు ఆడిన కుక్‌ కేవలం 18.62 సగటుతో 298 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత ఎనిమిదేళ్ల కాలంలో తొలిసారి అతని సగటు 45కంటే తక్కువగా పడిపోగా...  ఆటలో ప్రాథమిక స్థాయి బలహీనతలు కూడా ఇటీవల తరచుగా కనిపించాయి. ఇవన్నీ కుక్‌ రిటైర్మెంట్‌కు కారణమయ్యాయి.

టెస్టుల నుంచి రిటైర్‌ అయినా కౌంటీల్లో ఎసెక్స్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌ను కొనసాగిస్తానని అతను చెప్పాడు. పుష్కర కాలపు కెరీర్‌లో ఇంగ్లండ్‌ తరఫున పలు చిరస్మరణీయ టెస్టు విజయాలతో పాటు అనేక పరాభవాల్లో కూడా భాగంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత వహించిన కుక్, ఓవరాల్‌ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. దాదాపు రెండేళ్ల క్రితం భవిష్యత్‌లో సచిన్‌ టెండూల్కర్‌ అత్యధిక పరుగుల రికార్డును కూడా అధిగమించగలడని కుక్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వరుస వైఫల్యాలతో ఆ స్వప్నానికి కుక్‌ సుదూరంగా నిలిచిపోయాడు. టెస్టులకంటే ముందే వన్డేల్లో అరంగేట్రం చేసినా... మారుతున్న శైలిని అందుకోలేక విఫలమైన కుక్‌ వన్డే కెరీర్‌ 2014 డిసెంబర్‌లోనే ముగిసింది. 92 వన్డేల్లో అతను 36.40 సగటుతో 3204 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతను 4 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడటం విశేషం.  

గత కొద్ది నెలలుగా దీని గురించి తీవ్రంగా ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు ఇది బాధాకరమైన రోజే అయినా నా శక్తి మేరా జట్టుకు ఉపయోగపడ్డానని, ఇక నాలో సత్తా కరిగిపోయిందని తెలుసు కాబట్టి సంతోషంగానే ఉన్నాను. నేను ఊహించినదానికంటే చాలా ఎక్కువగా సాధించాను. దేశం తరఫున ఇన్నేళ్లు ఆడగలగడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రిటైర్‌ అయ్యేందుకు ఇది సరైన సమయం. నా కెరీర్‌లో ఎంతో మంది అండగా నిలచినా... నన్ను ఈ స్థాయికి చేరేలా తీర్చిదిద్దిన గ్రాహం గూచ్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. 
–అలిస్టర్‌ కుక్‌  

కుక్‌  టెస్టు కెరీర్‌ 
టెస్టులు 160 
ఇన్నింగ్స్‌  289 
పరుగులు 12,254 
అత్యధిక స్కోరు 294 
సగటు 44.88 
సెంచరీలు 32 
అర్ధసెంచరీలు 56 
క్యాచ్‌లు  173  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top