రంజీ ట్రోఫీలో ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ తొలి రోజు ఫర్వాలేదనిపిం చింది. భారీ స్కోరు చేయకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా జాగ్రత్తగా ఆడింది.
పోర్వోరిమ్: రంజీ ట్రోఫీలో ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ తొలి రోజు ఫర్వాలేదనిపిం చింది. భారీ స్కోరు చేయకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా జాగ్రత్తగా ఆడింది. గోవాతో ఇక్కడ శనివారం ప్రారంభమైన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.
కెప్టెన్ అక్షత్ రెడ్డి (191 బంతుల్లో 99; 14 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా... రవితేజ (102 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆట నిలిచే సమయానికి విహారి (44 బ్యాటింగ్), సందీప్ (23 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకైక విజయంతో 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్...ఈ గ్రూప్‌లో అవకాశాలు మెరుగు పర్చుకోవాలంటే ఈ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో విజయం సాధించాలి.
మార్పుల్లేని జట్టు
టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. త్రిపురతో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే హైదరాబాద్ బరిలోకి దిగింది. అయితే ఆరంభంలోనే తిరుమలశెట్టి సుమన్ (13)ను అవుట్ చేసి మంగళ్‌దాస్ దెబ్బ తీశాడు. అయితే అక్షత్, రవితేజ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన అక్షత్ చక్కటి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో రవితేజ 16వ, అక్షత్ 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు.
రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించిన అనంతరం రవితేజ వెనుదిరిగాడు. మంగళ్‌దాస్ బౌలింగ్‌లోనే కామత్‌కు రవి క్యాచ్ ఇచ్చాడు. విహారి అండతో శతకం దిశగా దూసుకుపోయిన అక్షత్‌కు అదృష్టం కలిసి రాలేదు. గడేకర్ బౌలింగ్‌లో ఫ్లిక్ చేసి సింగిల్ తీయబోయాడు. అయితే ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వాజ్ చేతుల్లో వాలింది. ఈ దశలో విహారి, సందీప్ మరో వికెట్ పడకుండా 25.4 ఓవర్ల పాటు నెమ్మదిగా ఆడి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 47 పరుగులు జత చేశారు.