ఐపీఎల్‌లో ఫ్లాప్‌ స్టార్స్‌

5 players who turned out to be biggest waste of money in IPL 2018 - Sakshi

సాక్షి, ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌ ముగిసింది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌ వేలంలో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తారనుకున్న ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. అయితే కోట్లు పెట్టిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఆయా ప్రాంఛైజీలు వరుస ఓటములను చవిచూశాయి. వేలానికి కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లు అంచనాలు అందుకోవడంలో ఘోరంగా చతికిలబడ్డారు.  సదరు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో జట్టు అవకాశాలను కోల్పయింది. వేలంలో కోట్లు పలికి ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన టాప్‌ 5 ఆటగాళ్లు వీరే.

అరోన్ ఫించ్( కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌)
టీ20 ఫార్మాట్‌లో ప్రత్యేకంగా స్థానమున్న ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్‌ను కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పోటీపడి రూ. 6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్‌లో అరోన్‌ ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. సీజన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌గా, మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో ఆటతీరుపై ప్రభావం పడింది.  మొత్తంగా ఈ సీజన్‌లో 134 పరుగులు మాత్రమే ఫించ్ చేయగలిగాడు.

గ్లెన్ మాక్స్‌వెల్(ఢిల్లీ డేర్‌డెవిల్స్‌)
సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లను అమాంతం మలుపు తిప్పగల ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్. దీంతో మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపీఎల్‌లో మంచి అనుభవం కూడా ఉండడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో కేవలం 169 పరుగులు సాధించి, 5 వికెట్లు మాత్రమే తీశాడు.

బెన్‌స్టోక్స్(రాజస్తాన్‌ రాయల్స్)
10 వ సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ వరకు చేరిందంటే దానికి కారణం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. అదే జోరు ఈ ఏడాది కొనసాగిస్తాడని ఆశించిన రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతను షాకిచ్చాడు. ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికిన స్టోక్స్‌.. ఈ ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఆల్‌రౌండర్‌గా పేరొందిన స్టోక్స్ 196 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు.

మనీశ్‌ పాండే(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)
ఈ ఏడాది జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు మనీశ్‌ పాండేను రూ.11.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే జట్టు తనపై పెట్టుకున్న ఆశల్ని మాత్రం మనీశ్ నెరవేర్చలేకపోయాడు. పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు మినహాయిస్తే.. మిగతా మ్యాచుల్లో మనీశ్ పాండే స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యాడు. తమ జట్టు కోసం ఆడకుండా.. ప్రత్యర్థి జట్టు గెలుపు కోసం మనీశ్‌కు కష్టపడుతున్నాడని సోషల్‌ మీడియాలో సెటైర్లు కూడా పేలేయాయి. ఈ టోర్నీలో  మనీశ్‌ కేవలం 284 పరుగులు మాత్రమే చేశాడు.

జయ్‌దేవ్‌ ఉనాద్కత్(రాజస్తాన్‌ రాయల్స్‌)
ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక ధర రూ.11.5 కోట్లు పలికిన భారత ఆటగాడు జయ్‌దేవ్‌ ఉనాద్కత్. టీ20ల్లో స్పెషలిస్ట్‌ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉనాద్కత్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. గత సీజన్‌లో పుణె తరపున 12 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో అదరగొట్టడంతో ఉనాద్కత్‌పై రాజస్థాన్‌ కోట్లు కుమ్మరించింది. కానీ ఈ సీజన్లో అతడు పేలవ ప్రదర్శన చేసి రాజస్థాన్ అంచనాలను తలక్రిందు చేశాడు. ఈ టోర్నీలో ఉనాద్కత్‌ 11 వికెట్లు మాత్రమే తీశాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top