
రేవంత్ మొబైల్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్న దర్శన్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవంత్
బొమ్మనహళ్లి : క్యాన్సర్ వ్యాధితో చివరి దశలో ఉన్న ఓ వీరాభిమానికి హీరో దర్శన్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పడంతో పాటు అన్ని విధాల వైద్య సహాయం కూడా చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో వీరాభిమానిలో ఆనందం వెల్లివిరిసింది. వివరాలు... శివమొగ్గకు చెందిన రేవంత్ (20)కు చాలెంజింగ్ స్టార్ దర్శన్ అంటే పిచ్చి అభిమానం. ప్రతి ఏడాది దర్శన్ పుట్టిన రోజు బెంగళూరు వెళ్లి దర్శన్ కలిసి శుభాకాంక్షలు చెప్పి వెళ్లేవాడు. అయితే ఇటీవల ఈ యువకుడు భయంకరమైన బోన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. ఇలాంటి తరుణంలో విషయం తెలుసుకున్న దర్శన్ ఆ అభిమానికి వీడియోకాల్ చేయడం అతడిలో ఎనలేని సంతోషాన్ని నింపింది. శుక్రవారం ఉదయం దర్శన్, రేవంత్ ఫోన్ కాల్ చేసి ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నానని, త్వరలో శివమొగ్గకు వచ్చి స్వయంగా కలుస్తానని రేవంత్‌కు చెప్పాడు.
ఎఫ్‌బీ ద్వారా తెలుసుకుని.. రేవంత్ ఫేస్‌బుక్ ద్వారా తన అభిమాన హీరో ఫొటోలు, స్టిల్స్ పోస్టు చేసేవాడు. ఎప్పటికప్పుడు దర్శన్ సినిమాలను అప్‌డేట్ చేసేవాడు. దీంతో దర్శన్ అభిమానులు సైతం రేవంత్ ఎఫ్‌బీని ఫాలో అయ్యేవారు. ఇటీవల రేవంత్ అనార్యోగ్యానికి గురికావడం, చివరిసారిగా హీరో దర్శన్‌ను కలుసుకోవాలనే చివరి కోరిక అని తన ఎఫ్‌బీలో పోస్టు చేశాడు. దర్శన్‌కు పరిచయం ఉన్న శివమొగ్గ నగరానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి ద్వారా రేవంత్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతో పాటు మలెనాడు వైద్యులు రేవంత్‌కు చికిత్స అందిస్తున్నారు.