
లుసాకా : ఆఫ్రికాలోని కీకారణ్యాల గురించి తెలియని వారుండరు. రకరకాల జంతువులకు ఆవాసం ఆఫ్రికా అడవులు. నిత్యం సాగే జీవన పోరాటాల్లో ఒక జీవిని మరో జీవి చంపడం కూడా అక్కడ పరిపాటే. కానీ, తూర్పు ఆఫ్రికాలోని జాంబియా దేశ అడవిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నీటి కోసం మడుగు దగ్గరకు వెళ్లిన ఓ చిరుత ఒడ్డున సేదదీరుతున్న మొసలిని వేటాడింది.
ఇలా మొసళ్లను ఓ జంతువు వేటాడటం చాలా అరుదని పదేళ్లుగా జాంబియా అడవుల్లో సంచరిస్తూ జంతువుల కదలికలను నిశితంగా గమనిస్తున్న ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ఏదైనా జంతువు నీటి దగ్గరకు వచ్చినప్పుడు మొసళ్లన్నీ జాగ్రత్త పడతాయని వెల్లడించారు. ఈ మొసలి ఆదమరిచి ఉండి ఉంటుందని చెప్పారు. రెండు అడుగులు పొడవున్న మొసలిని వేటాడిన తర్వాత చిరుత ఫొటోలను ఆయన సోషల్‌మీడయాలో షేర్ చేశారు.