బదిలీల ఫీవర్‌

Transfers Tenction In Nellore District - Sakshi

త్వరలో అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం

టీడీపీ హయాంలో చక్రం తిప్పిన అధికారులకు బదిలీలు

రెవెన్యూ, పోలీస్, నుడా, నగరపాలక సంస్థపైనే దృష్టి

జిల్లాలో కొందరు అధికారులు, ఉద్యోగులకు బదిలీల జ్వరం పట్టుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకశాఖల్లో ఉండి టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు మాత్రం బదిలీలు తప్పవని భావించి ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు కీలకశాఖ అధికారులు మాత్రం బదిలీల ఆందోళనలతో అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నారు. ప్రజాప్రతినిధుల సన్నిహితుల ద్వారా బదిలీలు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలు కూడా పారదర్శకంగా చేయాలని, అవినీతి అధికారులకు స్థానచలనం తప్పదన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి రావడంతో బదిలీల ప్రక్రియపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించనున్నారు.

సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. జిల్లాలో కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రి వర్గ విస్తరణలో కూడా జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు కీలక శాఖలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం తనదైన మార్క్‌ పాలన సాగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా చేసేందుకు కొత్త అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అప్పటి అధికారపార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పాలన సాగించిన అధికార యంత్రాంగాన్ని బదిలీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రాధాన్యత లేని పోస్టుల్లో గడిపిన వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు కేటాయించే అవకాశం ఉంది.

కీలక శాఖల అధికారుల మార్పు 
జిల్లాలో పాలనా పరమైన విషయాల్లో కీలకంగా ఉండే పలు కీలక శాఖల అధికారులు, ఉద్యోగులను బదిలీలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, పురపాలక, నుడా, మైనింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, జిల్లా పరిషత్‌ తదితర శాఖల్లో బదిలీలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ముందుగా గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉండి వన్‌సైడ్‌ పాలన సాగించిన అధికారులు, ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నెల్లూరుఅర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా)పై తొలి వేటు పడనుంది. ఈ వారంలోనే నుడా వైస్‌ చైర్మన్‌తోపాటు కీలక పదవుల్లో ఉన్న అధికారులపై బదిలీ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. గత రెండేళ్లలో నుడాలో భారీ అవినీతి చోటుచేసుకుంది.

నుడా పాలకవర్గం చేతిలో కీలుబొమ్మల్లా మారిన అధికారులు అవినీతి, అక్రమాలకు రాచబాట వేశారు. దీంతో తొలి విడతలోనే వారిని పంపే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు పలు పురపాలక సంఘాల్లో కూడా బదిలీలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణ సారథ్యంలో ఆయన కనుసన్నల్లో పనిచేసిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా అడ్డదిడ్డంగా పనులు చేసిన వారిని కూడా పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మైనింగ్‌ శాఖలో తొలివేటు పడింది. టీడీపీ హయాంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డికి తొత్తులా వ్యవహరించి సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేయడమే కాక ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచిన మైనింగ్‌ ఏడీ రాజశేఖర్‌ను కలెక్టర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.

ఐదేళ్ల టీడీపీ హయాంలో మైనింగ్‌ శాఖలో అక్రమాలు కోకొల్లలుగా జరిగినట్లు గుర్తించారు. రెవెన్యూ విభాగంలో కూడా బదిలీల ప్రక్రియ తప్పనిసరిగా ఉంటుంది. గత ప్రభుత్వ పెద్దలు జిల్లాలో తమకు అనుకూలంగా పనిచేసిన జిల్లాస్థాయి, డివిజన్‌స్థాయి అధికారులను బదిలీలపై రప్పించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిని కొనసాగిస్తే మాత్రం టీడీపీ పెద్దలతో వారికున్న సన్నిహితం, పరిచయాల వల్ల పాలనా పరమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారిని బదిలీ చేసి కొత్త టీంను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ పోలీసులు 
జిల్లాలో పోలీస్‌శాఖలో భారీ మార్పులు ఉండబోతున్నాయన్న సంకేతాలు రావడంతో డివిజన్, సర్కిల్‌స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు తొత్తుల్లా పనిచేయడమేకాక, పచ్చచొక్కా తొడిగిన పోలీసులకు మాత్రం బదిలీలు తప్పనిసరిగా ఉంటాయనే ప్రచారం ఉంది. దీంతో ప్రస్తుత అధికారపార్టీ చోటా, మోటా నేతలతో సంబంధాలు ఉన్న పోలీసులకు మాత్రం మరొకచోటికి స్థాన చలనం జరిగినా చాలన్నట్లుగా ప్రయత్నాలు మమ్మురం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు షాడో ఎస్పీగా చెలామణి అవుతున్న అధికారి కనుసన్నల్లో సీఐల బదిలీలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

ఎన్నికల సమయంలో అధికారపార్టీ నేతలకు కొమ్ము కాసే అధికార యంత్రాంగాన్ని ఏరికోరి జిల్లాకు రప్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. అధికారం మార్పు రాగానే టీడీపీ పచ్చచొక్కా తొడిగిన పోలీస్‌ అధికారులు కూడా ప్రాధాన్యత లేని పోస్టుల్లో కూడా కేవలం స్థాన చలనం చేసి మరొకచోటికి పంపితే వన్‌సైడ్‌గా చేస్తామన్నట్లుగా ప్రజాప్రతినిధుల వద్ద మంత్రాంగంనడుపుతున్నారు. అయితే ప్రస్తుత ప్రజాప్రతినిధులు మాత్రం బదిలీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీల విషయంలో జాగ్రత్త వహించకుంటే ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలు పలు జాగ్రతలు తీసుకుంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top