బీ అలర్ట్‌! | deadline for anganwadis for voters aadhar and mobile numbers collect | Sakshi
Sakshi News home page

బీ అలర్ట్‌!

Feb 1 2018 12:16 PM | Updated on Jun 2 2018 8:29 PM

deadline for anganwadis for voters aadhar and mobile numbers collect - Sakshi

ఒంగోలు టౌన్‌: జిల్లాలోని అంగన్‌వాడీల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కేంద్రాల నిర్వహణకు సంబంధించి ఏరోజుకారోజు వివరాలు అందించడంలో తలమునకలైన అంగన్‌వాడీలకు బూత్‌ లెవల్‌ అధికారుల విధులు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. జిల్లాలోని ఓటర్లకు సంబంధించిన ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లు, ఓటర్‌ ఐడీలను సేకరించి ఫిబ్రవరి 14వ తేదీలోపు అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోని అయోమయస్థితిలో పడ్డారు. గతంలో ట్యాబ్‌ల ద్వారా ఓటర్ల వివరాలను నమోదు చేశారు. తాజాగా ట్యాబ్‌ల స్థానంలో పెద్ద బుక్‌లెట్‌లు రావడం, ఓటర్ల వివరాలను అందులో సమగ్రంగా రాయాల్సి ఉండటంతో అంగన్‌వాడీలకు ఎక్కువ సమయం పడుతోంది.

ఫొటో పెట్టకుంటే మెమో..
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచేందుకు ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తకు మహిళా శిశుసంక్షేమశాఖ స్మార్ట్‌ ఫోన్లను అందించింది. కామన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ (సీఎస్‌ఏ) కింద జిల్లాలోని 4244 అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కేంద్రాల నిర్వహణను జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ మొదలుకొని ఆ శాఖ కమిషనర్‌ వరకు భూతద్దంలో చూస్తోంది. ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు తలుపులు ఎన్ని గంటలకు తెరుస్తున్నారు, అంగన్‌వాడీలు ఎన్ని గంటలకు హాజరవుతున్నారు, ఎంతమంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు హాజరవుతున్నారు, వారికి మధ్యాహ్న సమయంలో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారా.. లేదా..? అని అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో లోతుగా పరిశీలన చేస్తున్నారు.

కామన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత అంగన్‌వాడీలు ఠంఛనుగా కేంద్రాలకు చేరుకొని విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, కేంద్రాల పరిధిలోని చిన్నారులు భోజ నం చేసే ఫొటోను తీసి ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఒక్కరోజు భోజనం చేసే ఫొటోను పంపించకుంటే మరుసటిరోజు సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్తకు మెమో జారీ చేస్తున్నారు. బీఎల్‌ఓ విధులు నిర్వర్తించే సమయంలో లబ్ధిదారులు భోజనం చే సే ఫొటోలు పంపలేదని తమకు మెమోలు ఇస్తే ఎవరు బాధ్యత తీసుకుంటా రని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.

సీడీపీఓలకు షోకాజు టెన్షన్‌..
జిల్లాలోని సీడీపీఓలకు షోకాజు టెన్షన్‌ పట్టి పీడిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి ఏరోజుకారోజు మధ్యాహ్న భోజనం సమయంలో లబ్ధిదారుల ఫొటోలను కార్యకర్తలు పంపించకుంటే సంబంధిత ప్రాజెక్టుల సీడీపీఓలకు షోకాజు నోటీసులు జారీ అవుతున్నాయి. సెక్టార్‌ సూపర్‌వైజర్లు కూడా కార్యకర్తలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్లలోపు వయస్సు కలిగిన 81,93 మంది, 19,913 మంది గర్భిణులు, 24,670 మంది బాలింతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. కేంద్రాల వారీగా ఆ రోజు ఎంతమంది వచ్చారో ఆండ్రాయిల్‌ సెల్‌ఫోన్ల ద్వారా మెసేజ్‌ రూపంలో పంపడంతోపాటు వారు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఫొటో తీసి పంపాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ కార్యకర్తలు వివరాలను పంపించకుంటే సంబంధిత సీడీపీఓలకు షోకాజు నోటీసులు జారీ అవుతున్నాయి. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎంత అలర్ట్‌గా ఉన్నారో అంతకంటే ఎక్కువ అలర్ట్‌గా సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement