కామారెడ్డి జిల్లాలోనూ.. గులాబీ జెండా

ZPTC And MPTC Results TRS Party Winning Josh In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి:  కామారెడ్డి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరింది. మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సభ్యురాలే తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం అలంకరించనున్నారు. గత నెల 6, 10, 14 తేదీలలో మూడు విడతల్లో 22 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 22 జెడ్పీటీసీలకుగాను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు 14 చోట్ల విజయం సాధించారు. ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ బోణీకొట్టలేదు. కాగా జిల్లాలో 236 ఎంపీటీసీ స్థానాలుండగా.. 19 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఏకగ్రీవ ఎంపీటీసీ స్థానాలతో కలిపి టీఆర్‌ఎస్‌ పార్టీ 149 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి 61 స్థానాలు, బీజేపీకి నాలుగు స్థానాలు దక్కాయి. 22 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

చైర్‌పర్సన్‌గా దఫేదార్‌ శోభ! 
ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ రాజు భార్య శోభ నిజాంసాగర్‌ జెడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధించారు. ఆమెకే జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీనుంచి 14 మంది జెడ్పీటీసీలు గెలుపొందారు. ఇందులో నిజాంసాగర్‌ నుంచి గెలిచిన దఫేదార్‌ శోభ, బిచ్కుంద జెడ్పీటీసీ భారతి, బీర్కూర్‌ జెడ్పీటీసీ స్వరూప మాత్రమే బీసీ మహిళలు. జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ అవకాశం ముగ్గురికే ఉంటుంది. అయితే ముగ్గురిలో దఫేదార్‌ శోభకే చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

బాన్సువాడలో టీఆర్‌ఎస్‌ హవా 
అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఇక్కడ 20 వేల మెజారిటీ లభించింది. పోచారం తనయుడు భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు సక్సెస్‌ అయ్యాయి. నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్‌ మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే మూడు మండలాల్లో 26 ఎంపీటీసీ స్థానాలుండగా.. 25 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానానికే పరిమితమైంది.
 
నేతల సొంత మండలాల్లో ఎదురుగాలి.. 
జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేల సొంత మండలాల్లో ఎదురుగాలి తగిలింది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా.. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సొంత మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సొంత మండలం లింగంపేట. ఇక్కడ టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శ్రీలత విజయం సాధించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సొంత మండలమైన భిక్కనూరులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మ గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే సొంత మండలమైన జుక్కల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లక్ష్మీబాయి గెలిచారు. కాగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సొంత మండలమైన తాడ్వాయి మండలంలో మాత్రం టీఆర్‌ఎస్సే గెలుపొందింది. తాడ్వాయిలో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలనూ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌ సొంత మండలమైన నాగిరెడ్డిపేటలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.

షబ్బీర్‌ సొంత మండలంలో.. 
మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సొంత మండలమైన మాచారెడ్డిలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మిన్కూరి రాంరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలకుగాను 10 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందగా, రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఒక ఎంపీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.  మాజీ ఎమ్మెల్యే గంగారాం
 
భార్య ఓటమి 
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం భార్య సావిత్రమ్మ పెద్దకొడప్‌గల్‌ జెడ్పీటీసీగా పోటీచేసి ఓటమి చెందారు. పెద్దకొడప్‌గల్‌ మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలకు గాను ఐదు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top