‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది’

YV Subba Reddy Fires On Chandrababu Over Illegal cases - Sakshi

సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాలనే ఇందుకు నిదర్శనమన్నారు. గురువారం ఆయన దెందులూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, నాయకులు కొఠారు అబ్బయ్య చౌదరి, కోటగిరి శ్రీధర్‌, కారుమూరి నాగేశ్వర రావు, కమ్మ శివరామకృష్ణ ఉన్నారు.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలని ఆరోపించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు. నిధులు లేవని చంద్రబాబు పోలవరాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో ఎంత దోచుకున్నారనే లెక్కల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పర్యటనకు వస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదికి కూడా పోలవరం పూర్తయ్యేలా లేదన్నారు. కాసుల కోసమే ఏపీ ప్రభుత్వం పోలవరం చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం చిన్న ఘటనగా చూపే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌ తర్వాతైన ఈ ఘటనపై పోలీసుల తీరు మారకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ సీపీ పెదపాడు మండల అధ్యక్షుడు అప్పన ప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రజాబలం ఉన్న వైఎస్సార్‌ సీపీ నేతలపై అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో పోలీసులు కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధిచెబుతారని ఆయన అన్నారు.   

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top