లో​కేష్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారు..కానీ

YSRCP Party With Muslims Told By Ambati Rambabu - Sakshi

సాక్షి, గుంటూరు:  ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులపై అక్రమ అరెస్టులకు పాల్పడడం అమానుషం అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం యువకుల అక్రమ అరెస్టులకు నిరసనగా గుంటూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయనతో పాటు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, ముస్లిం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు అధైర్యపడవద్దని, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ ఘటనతో ముస్లింల ఓట్లు అడిగే పూర్తి హక్కు చంద్రబాబుకు పోయిందని, ఆయన హయాంలో ముస్లింలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. డిమాండ్లను ప్రశ్నిస్తే చర్చించడం మర్చిపోయి అణగదొక్కే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ పతనంతోనే ముస్లింలకు మేలు జరుగుతుందని అంబటి అభిప్రాయపడ్డారు. గతంలో ఎప్పుడైనా ముస్లింలు లేని కేబినెట్‌ చూశామా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముస్లింలను కేబినెట్‌లోకి తీసుకోరు కానీ, ఆయన కొడుకు లోకేష్‌ను మాత్రం తీసుకుంటారని దుయ్యబట్టారు. ముస్లింల అభివృద్ది గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.

ప్రశ్నించినందుకు అరెస్టు చేశారు: ముస్లిం యువకులు
శాంతియుతంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపిన తమను పోలీసులు అమానుషంగా అరెస్టు చేశారని ముస్లిం యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలైన అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.  2014లో ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నించినందుకు అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీసులు తమను ఈడ్చుకుంటూ నల్లమడుగు తీసుకెళ్లి బట్టలూడదీసికొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సంఘటనతో ముస్లింలపై చంద్రబాబుకున్న వ్యతిరేకత బటయపడిందని వారు పేర్కొన్నారు.

చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు
నాలుగేళ్లుగా ముస్లింలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత హబీబుల్లా విమర్శించారు. ముస్లింలను టీడీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిలో ముస్లింలు పాలుపంచుకుంటారన్నారు. కచ్చితంగా ముస్లింలు వారి రుణాన్ని తీర్చుకుంటారని వివరించారు. ముస్లిం యువకులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని ఆ పార్టీకి చెందిన మరో నేత శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top