
విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర రెండో రోజు చినగంట్యాడ నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి బుధవారం నుంచి పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. తన యాత్రలో భాగంగా ఆయన అడుగడుగునా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సంఘీభావ యాత్ర రెండో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. జగ్గు జంక్షన్ వుడా కాలనీ మీదుగా.. సీతానగర్, పెదగంట్యాడ, టీఎన్‌ఆర్ స్కూల్ వరకు సాగింది. గాజువాక నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి నివాసం మీదుగా.. బీసీరోడ్డులోకి వస్తోంది.
మధ్యాహ్నా విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు బీసీ రోడ్డు నుంచి సాగుతూ.. పశ్చిమ నియోజకవర్గంలోకి అడుగు పెడతారు. పశ్చిమ నియోజకవర్గంలో సాగే పాదయాత్రకు ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారు. జింక్ గేట్ నుంచి హిమాచల్‌నగర్, గణపతి నగర్, ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, అశోక్ నగర్ మీదుగా ఇందిరాకాలనీ, జనతాకాలనీ, హైస్కూల్ రోడ్డు, ఏడు గుళ్ల జంక్షన్ వద్దకు చేరుకుంటుంది. మల్కాపురం రెడ్డి కాలనీలో బహిరంగ సభలో విజయసాయిరెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తారు. అనంతరం.. ఏడు గుళ్ల జంక్షన్‌లో రాత్రి బస చేస్తారు. రెండో రోజున 51, 50, 62, 47,48 వార్డుల మీదుగా సాగనుంది.