‘చంద్రబాబుపై రాజద్రోహం కేసు పెట్టాలి’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుపై రాజద్రోహం కేసు పెట్టాలి’

Published Tue, Mar 5 2019 8:58 AM

YSRCP Leader Parthasarathy Slams Chandrababu Over IT Grids Data Breach - Sakshi

విజయవాడ సిటీ: తన స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అధికార దుర్వినియోగంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన చంద్రబాబుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఎలక్షన్‌ కమిషన్‌ను డిమాండ్‌ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రత్యేక యాప్‌లు ద్వారా ఓట్లు తొలగిస్తున్నారని ఆధారాలతో ఇచ్చినా ఎలక్షన్‌ కమిషన్‌ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని వివరాలతో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలక్షన్‌ కమిషన్‌ వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణలో ఐటీ దాడులు చేస్తే చంద్రబాబు ఉలిక్కిపడతాడు. వైఎస్‌ జగన్‌ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగిస్తే ఆయనకు భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారాలతో ఓట్లు తొలిగిస్తున్నారని ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఫిర్యాదు చేస్తే బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. 

ఇసుక మింగిన గొంతుకతో: వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధానిని అమరావతిని కాదని ఇడుపులపాయకు తీసుకెళ్లతాడని ఇసుక మింగిన గొంతుకతో ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను వెళ్లిపోవడం ఖాయం అని తెలిసి హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుంటే... ప్రజలకు అందుబాటులో ఉండి మేళ్లు చేయాలనే తలంపుతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకోవడం దేవినేని ఉమా కళ్లకు కన్పించడం లేదా అని నిలదీశారు.

Advertisement
Advertisement