నంద్యాలలో టీడీపీది గెలుపు కాదు.. బలుపు

Ysrcp leader Parthasaradhi takes on cm chandrababu naidu - Sakshi

హైదరాబాద్‌ : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలనకు నక్కకు నాగలోకానికి తేడా ఉందని స్వయంగా ప్రజలే చెబుతున్నారని, టీడీపీ పెద్దలు, నేతలు ఏ ఇంటికి వెళ్లి అడిగినా ప్రజల నుంచి ఇదే సమాధానం వస్తుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పార్థసారథి అన్నారు. నంద్యాలలో టీడీపీది గెలుపు కాదని.. బలుపు అని మండిపడ్డారు. అధికార బలం ఉపయోగించడంతోపాటు డబ్బును విచ్చలవిడిగా పంచడం వందలకోట్లు ఖర్చు చేయడంతో వారు గెలిచారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ ఆత్మీయ కుటుంబంలో దాదాపు 50లక్షల మంది చేరిన సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే..

'మేం ఎవరినీ బలవంతం చేయలేదు.. బలవంతంగా ఫోన్‌ చేయించలేదు.. మాయమాటలు అంతకంటే చెప్పలేదు. దాదాపు 50లక్షలమంది ప్రజలు స్వయంగా ఫోన్‌ చేసి వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చేరుతామని చెప్పారు. వారే వైఎస్‌ఆర్‌ కుటుంబంలో సభ్యుడిగా చేరాలని ఫోన్లు చేస్తున్నారు. 14 రోజులుగా వైఎస్‌ఆర్‌ కుటుంబ కార్యక్రమం ఆత్మీయంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మాక్కూడా ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరినీ పలకరించే అవకాశం దక్కింది. మాది ఆరు నెలలకోసారి కార్యక్రమాలు చేసే ప్రతిపక్షం కాదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ప్రతిపక్షం. నంద్యాలలో టీడీపీది గెలుపు కాదు.. బలుపు. మా పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనేందుకు వందలకోట్లు ఖర్చుచేశారు.

ప్రజలను భయపెట్టారు. రాష్ట్రం మొత్తానికి ప్రకటించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కచోట మరోసారి మోసం చేసి ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ఫోన్‌ చేసిన వారి సంఖ్య 50లక్షలకు చేరింది. ఇంటింటికి వెళ్లి రాజశేఖర్ రెడ్డిగారి పాలన గుర్తుందా అని ప్రశ్నిస్తే చిన్నపిల్లలు కూడా చాలా అద్భుతంగా చెబుతున్నారు. ఎస్సీఎస్టీలకు పది లక్షల ఎకరాలు పంపిణీ చేసిన ఘనత రాజశేఖర్‌రెడ్డి గారిదే. పెన్షన్ల విషయంలో ఎవరిపైనా వివక్ష చూపించలేదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా వైఎస్‌ఆర్‌ పాలనకు చంద్రబాబు పాలనకు ఉందని ప్రజలు అంటున్నారు.

నాడు భరోసా ఉండేదని.. ఇప్పుడు మూడున్నారేళ్లయినా అది లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎక్కడా చంద్రబాబు ఒక్క ఇళ్లు కట్టించలేదు.. ఇళ్ల స్థలం ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. అలాగే ఒక మంచి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్క ఇటుక కూడా పేర్చకుండా మళ్లీ అమరావతియే రాజధాని కావాలంటే తనకే ఓటు వేయాలని చంద్రబాబు బెదిరిస్తారని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటి వరకు రైతుల్లో నూటికి ఒకశాతం మందికే రుణమాఫీ అందింది. అది కూడా అరకొరే.. మహిళలకు ఎలాంటి రుణ మాఫీ చేయలేదు. పట్టిసీమ నుంచి నీళ్లిచ్చామని చంకలు గుద్దుకుంటున్న టీడీపీ 500 నుంచి 600కోట్లు దోచుకుంది. అంత పెద్ద మొత్తం ఖర్చు చేసి కేవలం 40 టీఎంసీలు ఇచ్చి చేతులు దులుపుకుంది' అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top