
చంద్రబాబు ఆస్తులు ప్రకటించే రోజును ఏపీ అబద్ధాల దినంగా పెట్టాలని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు
సాక్షి, విజయవాడ: భవిష్యత్తులో తెలంగాణపై తమ పార్టీ దృష్టి పెడుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేతుల్లో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌పైనే తమ పార్టీ దృష్టి పెట్టిందని, అందుకే తెలంగాణలో పోటీ చేయడం లేదని చెప్పారు. చంద్రబాబును ఓడించి ఏపీ ప్రజలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యం అన్నారు. తమ పార్టీ దృష్టి అంతా ఏపీపైనే కేంద్రీకరించామని తెలిపారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని చంద్రబాబు, రఘువీరాలు ప్రశ్నించడం అర్దరహితం అన్నారు. తెలంగాణలో పోటీ చేయడం లేదని గతంలోనే తమ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీ కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. ముష్టి 13 సీట్ లకోసం చంద్రబాబు నాయుడు దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలను ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు లేదని అంబటి వ్యాఖ్యానించారు.
ఆ రోజును ఏపీ అబద్దాల దినంగా పెట్టాలి
అధికారంలోకి వచ్చిన తరువాత తమ ఆస్తులు పెరగలేదని చెప్పుకోవడానికే చంద్రబాబు ప్రతి ఏటా ఆస్తులు ప్రకటన చేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఆయన ప్రకటించే ఆస్తుల వివరాలు ఎవరూ నమ్మే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించే రోజును ఏపీ అబద్ధాల దినంగా పెట్టాలని ఎద్దేవా చేశారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ సర్వే చేసి దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా చంద్రబాబును ప్రకటించిందని గుర్తు చేశారు.
లోకేష్ 2017లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో రూ.330.14కోట్లు ఆస్తులు ఉన్నట్టుగా చూపారని, ఇప్పుడు మాత్రం 26.39 కోట్లుగా చూపిస్తున్నారన్నారు. ఇంత తేడా ఎలా వచ్చిందో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఆస్తులు గత ఏడాది రూ.11.54 కోట్లు అయితే ఈ ఏడాది రూ. 15.74 కోట్లు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వేల కోట్లతో నిర్మించుకున్న చంద్రబాబు నివాసాన్ని కేవలం రూ.18 కోట్లుగా మాత్రమే చూపారని విమర్శించారు. ఆ ఇంటిని అందరికి చూపిస్తే చంద్రబాబు బండారం బయటపడుతుందన్నారు. నారా కుటుంబం మొత్తం అవినీతిలో మునిగిపోయిందని అంబటి ఆరోపించారు.