డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

YSRCP Bapatla MLA Kona Raghupathi Elected AP Assembly Deputy Speaker - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు కోన రఘుపతిని స్పీకర్‌ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులంతా డిప్యూటి స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు.

తండ్రి స్పీకర్‌.. కోడుకు డిప్యూటీ స్పీకర్‌
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్‌ స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top