వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల పోరాటం! | YSR Congress MPs Protest for Special Status for AP | Sakshi
Sakshi News home page

హోదా.. అవిశ్వాసం.. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల పోరాటం!

Mar 21 2018 11:42 AM | Updated on Mar 23 2019 9:10 PM

YSR Congress MPs Protest for Special Status for AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గత మూడురోజులుగా లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేలా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చొరవ చూపాలని వారు కోరారు. సభలో ఆందోళనలను నియంత్రించి.. అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ బుధవారం కూడా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే, బుధవారం కూడా లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తుండటంతో సభ ఇలా ప్రారంభం కాగానే.. అలా స్పీకర్‌ మహాజన్‌ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు మరోసారి నిరుత్సాహానికి గురయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు.. అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం పట్టుపడుతూనే ఉంటామని, కేంద్రంపై అవిశ్వాసం పెడుతూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అటు టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇచ్చింది. అయితే, సభలో కొన్ని విపక్ష పార్టీల ఆందోళనల వల్ల గందరగోళం నెలకొనడంతో అవిశ్వాస తీర్మానంపై చర్చను స్పీకర్‌ గత మూడురోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత అదే పరిస్థితి నెలకొనడంతో మరోసారి వాయిదా వేశారు. అయితే, వాయిదాల పర్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు.. ఇప్పటికైనా  సభలో అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూసేందుకు కేంద్రం ముందుకురావాలని కోరుతున్నారు.

చంద్రబాబు ద్రోహి..!
ఏపీకి బీజేపీ, టీడీపీ తీరని అన్యాయం చేశాయని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్న ద్రోహి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇకనైనా గొప్పలు చెప్పడం మానుకోవాలని, రాబోయే ఎన్నికల్లో ఆయనను ప్రజలు శిక్షించబోతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్నది వైఎస్‌ఆర్‌సీపీయేనని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. హోదా విషయంలో ఏపీకి చంద్రబాబు ద్రోహం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది చంద్రబాబేనని మండిపడ్డారు. హోదా కోసం తాము పోరాడుతుంటే.. తమను అణగదొక్కడానికి చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఈ రోజైనా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. సభ ఆర్డర్‌లో లేదని ఒకవైపు వాయిదా వేస్తూ.. మరోవైపు ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకుంటున్నదని  అన్నారు.  సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

చంద్రబాబు తన నీడ కూడా నమ్మరు
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మొదట తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామని చెప్పి.. ఆ తర్వాత చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని గుర్తుచేశారు. హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న బాబుకు నైతిక విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాలు పట్టవని, ఆయన తన నీడనే తాను నమ్మరని అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను ఎవరినైనా కలుస్తానని, దానికి చంద్రబాబు పర్మిషన్‌ అవసరం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని, ప్రతి రెండు, మూడేళ్లకోసారి భాగస్వామిని బాబు మారుస్తారని, ఆయనకు చిత్తశుద్ధి, విధివిధానాలు లేవని మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని విమర్శించారు.

నాలుగేళ్లుగా ఒకే మాట మీద నిలబడ్డాం
చంద్రబాబు తరహాలో లాలూచీ రాజకీయాలు చేయడం తమకు రాదని, నాలుగేళ్లుగా ఒకే మాట మీద ఉన్నామని ఎంపీ అవినాష్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తాము పార్లమెంటు లోపల, బయటా పోరాడుతున్నామని గుర్తుచేశారు. చంద్రబాబు మేడిపండులాంటివారు అని, పొట్టవిప్పిచూస్తే పురుగులు ఉంటాయని ఎద్దేవా చేశారు.

చంద్రబాబే కారణం
కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీకి మొగ్గుచూపారని ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబేనని అన్నారు. హోదాపై అసెంబ్లీలో ఒక్కసారి కూడా చంద్రబాబు మాట్లాడలేదని, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఇవ్వాలని రెండు చేతులు జోడించి స్పీకర్‌ను కోరామని వరప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement