వైఎస్సార్‌ లేని లోటు జగన్‌ తీరుస్తాడు 

YS Vijayamma Speech In Dhone Public Meeting - Sakshi

ఒక్క అవకాశమివ్వండి 

ప్రజలకు వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు 

వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన నడిచింది

ఓటేసే ముందు ఆలోచించండి.. చంద్రబాబు అబద్ధపు హామీలకు మళ్లీ మోసపోవద్దు

తన తండ్రిలా సంక్షేమ పాలన అందించేందుకు జగన్‌ తపనపడుతున్నాడు

వెఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మోజార్టీతో గెలిపించండి

కర్నూలు జిల్లా డోన్, ఆళ్లగడ్డలో విజయమ్మ ప్రచారం 

డోన్‌: ‘కష్టకాలంలో ఉన్న ఈ రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లేని లోటును జగన్‌ తీరుస్తాడు. ఒక్క అవకాశమివ్వండి’ అని ప్రజలకు వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రమంతటా అరాచక పాలన నడిచిందని దుయ్యబట్టారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. యువతకు ఉపాధి కరువైందని.. గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని.. చంద్రబాబు అబద్ధపు హామీలకు మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తన తండ్రిలా సంక్షేమ పాలన అందించేందుకు జగన్‌ తపనపడుతున్నాడని.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మోజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా డోన్, ఆళ్లగడ్డలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ఏం మాట్లాడారంటే.. 

జగన్‌ సోనియాకే భయపడలేదు..
కేసులకు భయపడి కేసీఆర్, మోదీతో జగన్‌ కలిశాడంటూ చంద్రబాబు విషప్రచారం చేస్తున్నాడు. జగన్‌ అలా భయపడే వ్యక్తి కాదు. సోనియాగాంధీనే ఎదిరించి నిలిచిన వాడు.. ఈరోజు కేసులకు భయపడతాడా? చంద్రబాబు ఓటమి భయంతో ఇష్టారీతిన దుష్ప్రచారం చేస్తున్నాడు. వైఎస్సార్‌సీపీది ఎప్పుడూ ఒంటరి పోరే. జగన్‌కు పొత్తు ఏదైనా ఉందంటే అది ప్రజలతోనే. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కూడా రాజకీయ విలువలు కాపాడేందుకు జగన్‌ పయత్నిస్తున్నాడు. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే.. వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నాడు. కానీ చంద్రబాబుకు ఇలాంటి లువలున్నాయా? ఆయనకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీని గెలిపించండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం.

కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం  జగన్‌ ఉన్నాడు..
కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించాయి. సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి.. ఆస్తులు అటాచ్‌ చేయించాయి. రకరకాలుగా వేధించారు.  అయినా కూడా జగన్‌ ఎప్పుడూ తన బాధను మీకు చెప్పుకోలేదు. పైగా ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యపైనా ఉద్యమించాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దీక్షలు, ధర్నాలు చేశాడు. రోజుల తరబడి కడుపు మాడ్చుకుని ప్రజల కోసం పోరాడాడు. పాదయాత్రలో జగన్‌ మీ కష్టాలు, బాధలన్నీ చూశాడు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ‘నేను ఉన్నాను..’ అని భరోసా ఇస్తున్నాడు. చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏమీ చేయకుండా.. ఎప్పుడూ మాపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం వెంట నిలిచిన ప్రజల కోసం నేను, షర్మిలమ్మ బయటకు వచ్చాం. మమ్మల్ని నమ్మి వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కోసం బయటకు వచ్చాం. ఈరోజు కూడా ప్రజలంతా మా కుటుంబమనుకొనే బయటకు వచ్చాం. మా ప్రతి కష్టంలోనూ అండగా ఉన్న ప్రజల కోసం మనం నిలబడాలని జగన్‌కు ఎప్పుడూ చెబుతూ ఉంటా. జగన్‌ కూడా నా భర్తలా మాట ఇస్తే తప్పడు. ఏ మాట ఇచ్చినా అది తప్పక నెరవేరుస్తాడు. వైఎస్సార్‌ లేని లోటును జగన్‌ తీరుస్తాడు. 

పన్నులు పెంచని పాలన వైఎస్సార్‌ది..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో ఆలోచించండి. చంద్రబాబు అబద్ధపు హామీలు, మోసాలతో అందర్నీ మోసం చేశాడు. ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్సార్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. పేదలు సైతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టారు. 108తో లక్షలాది మంది ప్రాణాలు నిలబెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టి ఎంతోమందిని ఉన్నత చదువులు చదివించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఆయనదే. 71 లక్షల మందికి పింఛన్‌ ఇచ్చారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు. పన్నులు గానీ, చార్జీలు గానీ ఒక్క పైసా కూడా పెంచకుండా పాలన అందించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చూపించి మాత్రమే ఆయన 2009లో మళ్లీ ఓటు అడిగారు.  

కులాల మధ్య చిచ్చు పెట్టే దుర్మార్గుడు చంద్రబాబు..
బీసీలకు న్యాయం జరిగిందంటే అది ఒక్క వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మాత్రమే. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే దుర్మార్గుడు చంద్రబాబు. బీసీలను ఘోరంగా మోసం చేశాడు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులన్నీ దుర్వినియోగం చేశాడు. బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాడు. ఈ ఐదేళ్లలో ఒక్క మేలు కూడా చేయలేదు. పైగా బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ లేఖలు రాశాడు. ఈ విషయాన్ని జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారు. మైనార్టీలను కూడా చంద్రబాబు దగా చేశాడు. తమ సమస్యలు చెప్పుకునేందుకు గుంటూరు వెళ్లిన ముస్లింలను అరెస్టు చేయించి జైల్లో పెట్టించాడు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా దిగజారుతాడు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వైఎస్సార్‌లా బీసీలకు మేలు చేసేందుకు జగన్‌ కూడా శాయశక్తులా కృషి చేస్తున్నాడు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు పెట్టాడు. వైఎస్సార్‌సీపీ తప్ప ఈ పని ఏ ఒక్క పార్టీ కూడా చేయలేకపోయింది. అలాగే పదవుల్లో కూడా బీసీలకు జగన్‌ పెద్దపీట వేశాడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top