బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు: విజయమ్మ

YS Vijayamma Speech At Chodavaram Public Meeting - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారి పాలనలో మహిళలను అన్ని రంగాల్లో భాగస్వామ్యులుగా చేశారు. కానీ చంద్రబాబు హయంలో మహిళలై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి వేధింపుల గురై చనిపోతే ప్రభుత్వం నిందితులకు కొమ్ము కాసింది. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మహిళ ఎమ్మార్వోపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చర్యలు ఉండవు. మహిళలపై దాడులలో దేశంలోనే ఏపీ 8వ స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని’ విజయమ్మ పేర్కొన్నారు. బుధవారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. 

ఇంకా విజయమ్మ మాట్లాడుతూ.. ‘30 ఏళ్ల​ పాటు రాజశేఖరరెడ్డి గారిని మీ భుజాలపై మోశారు. రాజశేఖర్‌రెడ్డి ప్రతి జిల్లాకు 60 నుంచి 70 సార్లు వచ్చి ఉంటారు. చాలా మందిని పేర్లు గుర్తుపెట్టుకుని మరి పిలిచే అప్యాయత ఆయనది. ఆయన సీఎం అయ్యేసరికి ఏ జిల్లాకు ఏం కావాలో తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఏం కావాలో చేశారు. కరెంట్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఏ ఒక్కటి కూడా పెంచకుండా వైఎస్సార్‌  పాలన నడిచింది. దేశంలో మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే.. వైఎస్సార్‌ కేవలం రాష్ట్రంలోనే 48 లక్షలు కట్టారు.  రాజశేఖరరెడ్డి గారి పాలన చూడటానికి 13 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చారు. ఆనాడు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్‌ నుంచి అధికారులు వచ్చారు. 

అఖరి క్షణం వరకు వైఎస్సార్‌ ప్రజల కోసమే ఆలోచించారు..
వైఎస్సార్‌ చనిపోయాక ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వైఎస్సార్‌ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పుడు జన్మభూమి కమిటీ సిఫారసు చేయనిదే ఏ ఒక్క పని జరగదు. రచ్చబండ కోసం వెళ్లే సమయంలో మూడేళ్లలో పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలి అని రాజశేఖరరెడ్డి అన్నారు. అఖరి క్షణం వరకు ప్రజల కోసమే వైఎస్సార్‌ ఆలోచించారు. రాజశేఖరరెడ్డి గారి మరణం తరువాత ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించడానికి జగన​ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు.  జగన్‌ ఓదార్పు యాత్ర చేపడితే మీరు అక్కున చేర్చుకున్నారు. పావురాల గుట్ట వద్ద నాన్న కోసం చనిపోయిన వాళ్లను పరామర్శిస్తానని జగన్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటునే జగన్‌ ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు పొమ్మనలేక పోగ పెట్టారు. దీంతో జగన్‌ కాంగ్రెస్‌లో ఇమడలేక బయటకు వచ్చారు. దీంతో ఆయనపై కుట్రలు పన్ని ఇబ్బందులకు గురిచేశారు. 

ఆ రోజు 18 మంది ఎమ్మెల్యేలు మన కోసం రాజీనామా చేశారు. ఎంపీ పదవికి మేకపాటి గారు రాజీనామా చేశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు వైఎస్‌ కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్‌ కుటుంబం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది. ఈ తొమ్మిదేళ్లు జగన్‌ మీ మధ్యనే ఉన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన జగన్‌ అక్కడ ఉన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఢిల్లీ వేదికగా ధర్నాలు, దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉంది అంటే అది జగన్‌ వల్లనే. 

వైఎస్సార్‌ ఆశయాల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టింది. రాజశేఖరరెడ్డి, జగన్‌, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు మీరు ఆదరించారు. మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదని జగన్‌ గర్వంగా చెప్తారు. నాయకులు పార్టీని విడిచిపెట్టిపోయిన ప్రజలు మనతోనే ఉన్నారు.  ఈ రోజు చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన అన్యాయం, అవినీతి, మోసమే కనబడుతున్నాయి. రాజధాని భూములు, విశాఖలో భూములు, దళితుల భూములను చంద్రబాబు, ఆయన బినామీలు దోచుకుంటున్నారు.

రైతులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు..
చంద్రబాబు 2014లో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వారిని మోసం చేసిన చంద్రబాబు.. రైతులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. గిట్టుబాటు ధరలు లేక, బ్యాంకులు రుణాలు ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ సీఎం కావాలి. చంద్రబాబు పాలనలో ఏమైనా అభివృద్ధి జరిగిందా?. గత ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చినా చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.

అక్కాచెల్లమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు..
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12,500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే అయిపోతుంది. సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది.

గ్రానైట్‌ కొండలు మింగేశారు..
చోడవరం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ మీద వేల మంది ఆధారపడ్డారు. 2004 వరకు నష్టాల్లో ఉన్న షుగర్‌ ప్యాక్టరీని రాజశేఖరరెడ్డి లాభాల్లోకి తీసుకువచ్చారు. కానీ తన బినామీలకు అప్పజెప్పేందుకు చంద్రబాబు మళ్లీ నష్టాల్లోకి తీసుకెళ్లారు. లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పార్ట్‌ వన్‌కి రాజశేఖరరెడ్డి గారు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు, ఆయన అనుచరులు ఏం చేశారంటే.. బుచ్చయ్యపేట మండలంలో 50 కోట్ల విలువైన దళితుల భూములు కబ్జా చేశారు. ఇసుక దోచుకున్నారు. రావికమతం మండలంలో గ్రానైట్‌ కొండలను మింగేశారు. నీరు చెట్టు అంటూ 36 కోట్లు స్వాహా చేశారు. పింఛన్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారు. పింఛను కోసం వికలాంగులు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. పింఛన్ల కోసం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి.

వైఎస్‌ జగన్‌ అధికారంలో రాగానే.. చోడవరం షుగర్‌ ఫ్యాక్టర్టీని లాభాల్లోకి తెచ్చుకుందాం. సాగునీటి కాలువలను ఆధునీకరణ చేసుకుందాం. మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించుకుందాం. చెరకు రైతులకు జగన్‌ గిట్టుబాటుధర కల్పిస్తారు. ప్రత్యేక హోదా అనేది మనకు చాలా ముఖ్యమైనది. 25 మంది ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేక హోదా సాధించుకుందాం. వైఎస్‌ జగన్‌ ఏ రోజు కూడా ఏ పార్టీతో కలువలేదు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్లకు మాత్రమే మద్దతిస్తాం. ఆంధ్ర ప్రజానీకంతోనే వైఎస్సార్‌ సీపీ పొత్తు. కాంగ్రెస్‌తో కలిసి అక్రమ కేసులు పెట్టినప్పుడే జగన్‌ భయపడలేదు. అలాంటింది ఇప్పుడు ఎందుకు భయపడతారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీని, ఎంపీ అభ్యర్థి సత్యవతమ్మను భారీ మెజారిటీతో గెలిపించమ’ని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top