నవరత్నాలు భేష్‌..

Ys jagan's praja sankalpa yatra in kakinada - Sakshi

యువ బ్రాహ్మణుల ప్రశంసలు.. భారీగా వైఎస్సార్‌సీపీలో చేరిక   

జననేత అడుగులో అడుగేసిన కాకినాడ జనం.. సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు

అందరినీ ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగిన ప్రతిపక్ష నేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలు చాలా బావున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దేవుని ఆశీర్వాదంతో జగన్‌ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని మరిపించే విధంగా ఆయన పాలన ఉండబోతోందని మాకు సంపూర్ణ విశ్వాసం కలుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మా శాయశక్తులా కృషి చేస్తాం’ అని కాకినాడకు చెందిన పలువురు బ్రాహ్మణ యువకులు పేర్కొన్నారు.ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 216వ రోజు గురువారం కాకినాడ పట్టణంలో కొనసాగింది.

ఉదయం పలువురు బ్రాహ్మణ యువకులు జగన్‌ను కలుసుకున్నారు. నవరత్నాల పథకాలు తమను ఆకట్టుకున్నాయని, మీ పోరాట పటిమ చాలా నచ్చడంతో పార్టీలో చేరాలనుకుంటున్నామని తమ అభీష్టాన్ని వెల్లడించారు. దీంతో జగన్‌ సుమారు 50 మంది బ్రాహ్మణ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆకెళ్ల మురళీకృష్ణ, విఆర్‌జె దిలీప్‌కుమార్, భమిడిపాటి మూర్తి, ఎస్‌.విష్ణుమూర్తి, వేదుల మణితో పాటు పలువురు యువకులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అకుంఠిత దీక్షతో పని చేస్తామని చెప్పారు.  

తరలివచ్చిన జనం
కాకినాడలో రెండవ రోజు కూడా జగన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం జననేత అడుగులో అడుగు వేశారు. కాకినాడలో బుధవారం జగన్‌ బ్రహ్మాండమైన బహిరంగ సభలో పాల్గొన్నాక రాత్రికి ఆదిత్య కళాశాల సెంటర్‌ వద్ద బస చేశారు. గురువారం ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించడానికి ముందే పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు శిబిరం వద్దకు తరలి వచ్చారు.

ఆ పరిసరాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటంతో వాటిలో చదువుకునే విద్యార్థులు సైతం పెద్ద సంఖ్యలో జగన్‌ను కలవడానికి ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని వచ్చారు. పాదయాత్ర ప్రారంభం కాగానే రోడ్డుపై వందల సంఖ్యలో విద్యార్థినులు ఉత్సాహంతో జగన్‌ను కలిశారు. అక్కడి నుంచి మాధవనగర్‌ మీదుగా జేఎన్‌టీయూ సెంటర్‌ వరకూ దారి పొడవునా వేలాది మంది జగన్‌ వెంట నడిచారు. ఇక వినతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి.

కాకినాడకు చెందిన మత్స్యకారులు.. హార్బర్‌ కోసం కేటాయించిన భూమిని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు కబ్జా చేశారని జగన్‌కు వినతిపత్రం అంద జేశారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌కు వివరించారు. ఉప్పరలను ఆదుకోవాలని ఆ సంఘం నేతలు నక్కా మాధవరావు, లోవరాజు కోరారు.  

మా మద్దతు జగన్‌కే...
కాకినాడ ముస్లిం నేతలు ఎండీఏ ఖౠన్, ఏకె జిలాని, కరీంఖాన్, అహ్మద్‌ ఖాన్‌ తదితరులు జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి వస్తేనే అందరి కష్టాలు తీరతాయని, అందుకే తాము పూర్తిగా మద్దతిస్తున్నామని ప్రకటించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో పేదలు అధికంగా ఉన్న ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగన్‌ అందరికీ ‘రోటి, కపడా ఔర్‌ మకాన్‌’ కల్పిస్తారన్న నమ్మకం ఉందన్నారు. దారిపొడవునా పలువురు ప్రజలు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, రేషన్‌లో కోత విధిస్తున్నారని అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదని జగన్‌ ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. అందరికీ ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు.   

టీడీపీ పాలనలో అన్నీ కష్టాలే
అన్నా.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నిరుపేదలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదు. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా లాభం లేదు. రేషన్‌ షాపుల్లో గతంలో తొమ్మిది సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటి రెండు సరుకులు కూడా సరిగా ఇవ్వడం లేదు. కొంతమందికి సరుకులు ఇవ్వకుండానే వేలిముద్రలు వేయించుకుని పంపిచేస్తున్నా పట్టించుకునే వారు లేరు.   – వైఎస్‌ జగన్‌తో డానెల బేబి, కాకినాడ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగులు మరింత బాధ్యతతో పని చేస్తారు. ఈ దిశగా ఇప్పటికే మీరు చేసిన ప్రకటనపై ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన వారికి క్యాడర్‌తో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలి.    – వైఎస్‌ జగన్‌తో డి.రామ్‌మోహన్‌రావు  

జగనన్న వస్తేనే అందరికీ న్యాయం
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. నేను 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నాను. పాదయాత్ర అనంతరం వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యారు.  రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. ఇప్పుడు వైఎస్‌ మాదిరిగా జగనన్న కూడా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలందరికీ మేలు చేస్తారనే నమ్మకం ఉంది.    – పందిటి ధనలక్ష్మి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top