మాకు ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి : వైఎస్‌ జగన్‌ | YS Jagan Introduced AP Special Status Resolution | Sakshi
Sakshi News home page

మాకు ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి : వైఎస్‌ జగన్‌

Jun 18 2019 2:14 PM | Updated on Jun 18 2019 7:04 PM

YS Jagan Introduced AP Special Status Resolution - Sakshi

సాక్షి, అమరావతి : తమకు ప్యాకేజీ వద్దని, రాష్ట్రాన్ని సంజీవని అయిన ప్రత్యేక హోదానే కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసిందని, అయితే ఆ ప్యాకేజీ తమకు వద్దని హోదా కావాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానం ప్రవేశం పెడుతున్నట్లు వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏపీకి జీవనాడి అయిన ప్రత్యేకహోదాను జాప్యం లేకుండా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరఫున ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

‘ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ ప్రజల అభిప్రాయానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజనతో మనకు అన్నివిధాలుగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆనాటి కేంద్రప్రభుత్వం మొండిగా ముందుకు నడిచింది. గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ.. గత ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో ఆ ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలని  తీర్మానం ప్రవేశపెడుతున్నాం. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 59 శాతం మంది జనాభాను, అప్పులను వారసత్వంగా పొందాం. కానీ ఆదాయాన్ని 47 శాతం మాత్రమే పొందాం. ఆధాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధాన్ని కోల్పోయాం. విభజన నాటికి రూ.97 వేల కోట్లున్న రుణం ఐదేళ్లలో రూ.2,58,928 కోట్లకు ఎగబాకింది. 2013-14 ఏడాది ఏపీ నుంచి రూ.57 వేల కోట్లు సాప్ట్‌వేర్‌ ఎగుమతులు ఉండగా.. ఒక్క హైదరాబాద్‌ నుంచే రూ.56 వేల 500 కోట్లు ఎగుమతులు జరిగాయి. విభజన సమయంలో అధికార, పత్రిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. విభజన హామీలు నెరవేర్చకపోవడం వల్లే.. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సామాజిక, దుస్థితికి దారి తీసింది. 

ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది అవాస్తవం..
14వ ఆర్థిక సంఘం సిఫారసులు మేరకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనేది అవాస్తవం. నిజం ఏమిటన్నది అందరి ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం గౌరవ సభ్యులు ప్రొఫెసర్‌ అభిజిత్‌ సింగ్‌ లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరి హోదా రద్దుకు సిఫారసు చేయలేదని, ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సింగ్‌ స్పష్టంగా వివరించారు. పరిశీలించడానికి సభ సమక్షంలో నేను ప్రవేశపెడుతున్నాను. 2014 మార్చి 20న ప్రత్యేక హోదా మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసిందని గుర్తు చేస్తున్నాను. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా ఆ మంత్రి మండలి ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హోదా అమలు కాలేదు.

ప్రత్యేక హోదానే రాష్ట్రానికి జీవనాడి..
ప్రత్యేక హోదానే రాష్ట్రానికి జీవనాడి. జాప్యం లేకుండా హోదా ఇవ్వాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరఫున ప్రకటన చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నా. ఇదే కాపీని నీతిఅయోగ్‌ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో చదివి వినిపించాను. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కావాలని చెప్పడం కోసం ఈ తీర్మానం పెడుతున్నాం. ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించారు. ఆ హామీని నిలబెట్టుకోలేని పార్లమెంట్‌కు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉండటం న్యాయమేనా? యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా.. ప్రత్యేక హోదాతోనే సాధ్యం. హోదా ద్వారా వచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలు కీలకం. ప్రత్యేక హోదాతో మాత్రమే మనకు అత్యంత అవసరమైన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌, ఉత్పత్తి రంగంలో పరిశ్రమలు, ఐటీ సేవలు, అత్యుత్తమ విద్యా సంస్థలు వస్తాయి. ఇవన్నీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.’ అని వైఎస్‌ జగన్‌ ప్రకటన చేశారు. అనంతరం ఈ తీర్మానంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement