లింగాయత్‌లకు రాహుల్‌ మద్దతిస్తారా?

Will Rahul Support Lingayats? - Sakshi

సాక్షి, బెంగళూరు : రానున్న రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓటర్లను ఆకర్షించడానికి గుళ్లు గోపురాలతో పాటు లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన మఠాలను కూడా సందర్శిస్తున్నారు. లింగాయత్‌లు తమనొక మతంగా గుర్తించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.

గతేడాదయితే ఈ డిమాండ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు.  లింగాయత్‌లు తమను ప్రత్యేక మతంగా గుర్తించడమే కాకుండా ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది వారు నిర్వహించిన ఆందోళన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వారి డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఓ ప్రతిపాదనను కేంద్రానికి పంపించారు. దానిపై బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా సంతకం చేశారు.

స్వతహాగ లింగాయత్‌లు బీజేపీ మద్దతుదారులు కాగా, వారిపట్ల బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆ విషయం పక్కన పెడితే లింగాయత్‌లను ఆకర్షించడం కోసం వారి డిమాండ్‌కు సానుకూలంగా స్పందించేందుకు రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

12వ శతాబ్దానికి చెందిన బసవయ్య ప్రవచనాలకు ప్రభావితులై లింగాయత్‌లుగా మారిన వారు హిందూ మతానికి భిన్నమైన వారేమీ కాదు.వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ హిందూ మతాన్నే పాటిస్తారు. ప్రజలు వారిని లింగాయత్‌లు లేదా వీరశైవులుగా పిలుస్తారు. వారిలో కొంతమంది మాత్రమే తాము ఒక్కటి కాదని, లింగాయత్‌లు, వీరశైవులు వేరని వాదిస్తారు. రెండూ ఒక్కటేనని ‘అఖిల భారత వీరశైవ మహాసభ’ ప్రకటించింది. కాదని, తాము కూడా త్వరలో అఖిల భారత లింగాయత్‌ల సభను ఏర్పాటు చేసుకుంటామని మరికొందరు నాయకులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో వివధ వర్గాల అభిప్రాయలను తెలుసుకొని ఓ నిర్ణయానికి రావడానికి సిద్ధ రామయ్య రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ తన సిఫార్సులను ఇంకా సమర్పించాల్సివుంది. కమిటీ లాంటి కారణాలను చూపించి కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ రాహుల్‌ గాంధీ వాయిదా వేసే అవకాశం ఉంది. లింగాయత్‌లు మొట్ట మొదటిసారిగా తమను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ 1940లో ఉద్యమాన్ని లేవదీశారు. అయితే, దాన్ని అప్పటి బ్రిటీష్‌ పాలకులు పట్టించుకోలేదు. గతేడాది నుంచే మళ్లీ ఈ ఉద్యమం కాస్త జోరందుకుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top