ఆ ఐకమత్యం.. ఎవరికి బలం?

For whom to benefit Telangana Grand Alliance? - Sakshi

‘‘ఐకమత్యమే బలం అని ఒక నానుడి ఉంది. అది ఎల్లవేళలా ఒకేలా వర్తిస్తుందనే నమ్మకం లేదు’’ 
‘‘అదేంట్సార్‌ అలా అంటారు. ఐకమత్యం బలమే కదా. చిన్నప్పుడు దీనికి ఉదాహరణగా గడ్డిపోచలన్నీ కలిసి, తాడులా మారి ఏనుగును కట్టేసిన కథ చదివాం కదా. ఇప్పుడు కూడా అలాగే ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా మారి వాళ్ల ప్రత్యర్థి ఏనుగును కట్టడి చేయాలనుకుంటున్నాయి. తప్పేముంది’’ 
‘‘తప్పేమీ లేదు. ఐకమత్యం బలమే. కానీ ఇప్పుడది మరి కాస్త డిఫరెంట్‌గా వర్క్‌ఔటవుతోందని నీకు అనిపించడం లేదా?’’ 
‘‘డిఫరెంట్‌గా అంటే ఎలా?’’ 
‘‘సపోజ్‌.. మనం ఎంతో చిల్లర పోగుచేస్తాం. ఎదుటివాడి దగ్గర ఉన్న ఒక నోట్ల కట్టకంటే కూడా మన దగ్గర  మరింత ఎక్కువ వ్యాల్యుబుల్‌ చిల్లర ఉండనే ఉంటుంది. కానీ దాన్ని నోట్లుగా మార్చి ఎదుటివాడి దగ్గర ఉన్న కట్ట కంటే ఎక్కువ విలువ అని నిరూపించినప్పుడే కదా మన సౌలభ్యం, సౌకర్యం. కాకపోతే చిల్లర విషయంలో నోట్లుగా మార్చుకోవాలి. ప్రజాకూటమి విషయంలో పార్టీల బలాలను ఓట్లుగా మార్చుకోవాలి’’ 

‘‘ఇప్పుడు ప్రజాకూటమిలో అలా జరగడం లేదంటారా?’’ 
‘‘జరుగుతుందంటవా? నాకైతే... చిల్లర చిల్లర అంతా కలిసి, దాన్ని నోట్లుగా మార్చుకోలేక.. ఆ మోతభారాన్ని ఎవరు మోయాలంటూ జరుగుతున్న కప్పల తక్కెడ యవ్వారంగానే కనిపిస్తోంది’’ 
‘‘ఊర్కోండి అదేం జరగదు. ఐదువేళ్లూ కలిస్తే పిడికిలి అన్నది పాత సామెత. ఇప్పుడు జమానా అంతా హెల్దీ డైట్‌ వ్యవహారం కదా. ఆ ఉదాహరణే చెప్పుకుందాం. పది రకాల పండ్ల ముక్కలన్నీ కలిస్తేనే ఫ్రూట్‌సలాడ్‌. ఒక్క పండుతో ఒక్క బలమే. పది పండ్లతో పదింతల బలం’’ 
‘‘ఒక్క మాట చెప్పనా? మీరు హర్ట్‌ కావద్దు’’ 
‘‘కానులెండి. చెప్పండి’’ 
‘‘మొదట మీ పాత సామెత ప్రకారం చూద్దాం. ఐదువేళ్లూ కలిస్తే పిడికిలి. కానీ చేతులు రెండు చాచి బియ్యాన్ని ఒడుపుగా తీసుకుంటే దక్కేది చారెడు. కానీ పిడికిలి మూసి బియ్యం బస్తాతో ముంచి తీస్తే దొరికే గింజలెన్ని? ఇక మీ మోడ్రన్‌ ఉదాహరణకు వద్దాం. పదిపండ్లు తింటే పదిందత బలం. కానీ మన గ్రేటెస్ట్‌ నేతాస్‌ అంతా ముక్కలు ముక్కలుగా తరుక్కుపోయి పదిమందీ ఫ్రూట్‌సలాడ్‌గా మారారు. ఇక్కడ బలం దక్కేది సదరు ఫ్రూట్‌ముక్కలకు కాదు... దాన్ని తెలివిగా తినేసేవాడికి. కాబట్టి ఏర్పడగానే అది ప్రజాకూటమి కాదు... దాన్ని ఎవరు స్మార్ట్‌గా యూజ్‌ చేసుకుంటాడో వాడికి పండగ. కాబట్టి... ముందుంది ఫ్రూట్‌సలాడ్‌ ఫెస్టివల్‌’’.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top