‘దేశంలో కాంగ్రెస్‌తో ఎక్కడా పొత్తులేదు’

We Dont Need 7 Seats Mayawati Fires On Congress - Sakshi

లక్నో: లోక్‌సభ కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి 7 సీట్లను వదిలేసినట్లు కాంగ్రెస్‌ ప్రకటించడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరిచ్చే ముష్టి ఏడు స్థానాలకు తమకు అవసరం లేదని, లేని కూటమిని ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. మీ (కాంగ్రెస్‌) నుంచి మాకు ఎలాంటి సహకారం అవసరంలేదని, మొత్తం 80 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసుకోవచ్చని మాయావతి సూచించారు. ‘‘యూపీలోనే కాదు దేశంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌-బీఎస్పీ పొత్తు లేదు. వారి అసత్య ప్రచారాన్ని నమ్మకండి’’ అని అన్నారు.
కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేసిన మాయావతి

కాగా రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి లోక్‌సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థులను పోటీలో నిలపడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 12 స్థానాలకు ఇతర పార్టీలకు వదిలేస్తున్నట్లు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మైన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్‌ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కనౌజ్‌ నుంచి, బదౌన్, ఫిరోజాబాద్‌ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్‌ యాదవ్‌ బరిలోకి దిగనున్నారు. అప్నాదళ్‌కు గోండా, పిలిభిత్‌ స్థానాలను వదిలేస్తున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది.
ఆ ఏడు స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌ దూరం

 బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆరెల్డీ అధ్యక్షుడు అజిత్‌ సింగ్, ఆయన కుమారుడు జయంత్‌ చౌదరి పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా మా అభ్యర్థులను నిలపడంలేదని యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌  తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్‌ 11 నుంచి మే 19 మధ్యకాలంలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. 
24 ఏళ్ల తర్వాత తొలిసారి ములాయం కోసం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top