నేతల దరి..పర్వతగిరి

Warangal Constituency Review on Lok Sabha Election - Sakshi

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పర్వతగిరికి రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యం ఉంది. రాజకీయ వ్యూహరచనకు కేంద్ర బిందువులా పర్వతగిరి మారింది. ఎంతో మంది కీలక నేతల రాజకీయ భవితకు ఈ ప్రాంతమే పునాదిగా నిలిచింది. ప్రస్తుత రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి తక్కళ్లపెల్లి పురుషోత్తమరావు, ప్రస్తుత కరీంనగర్‌ లోకసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పర్వతగిరి.. ఆ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారే కావడం విశేషం.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్వతగిరికి చెందినవారే. ఎర్రబెల్లి రాజకీయ ప్రస్థానం వర్దన్నపేట నియోజకవర్గం నుంచి మొదలైంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు గెలుపొందారు. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ తరపున వర్దన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 1994, 1999, 2004లో ఎన్నికల్లో వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్‌ లోకసభ సభ్యునిగా పోటీచేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్దన్నపేట ఎస్సీకి రిజర్వ్‌ అయింది. దీంతో 2009, 2014లో టీడీపీ తరపున పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 2015లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో పాలకుర్తి ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.

కీలక నేత కడియం
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిది పర్వతగిరినే. ఆయన రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1994, 1999, 2008 ఎన్నికల్లో టీడీపీ తరపున స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో వరంగల్‌ లోకసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2015లో అనుహ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చే పట్టారు. అదే ఏడాది జూన్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.

బోయినపల్లి వినోద్‌ కుమార్‌
ప్రస్తుత కరీంనగర్‌ లోకసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ సొంతురు పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామం. 2005, 2008 ఎన్నికల్లో హన్మకొండ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ పున ర్విభజన లో హన్మకొండ లోక్‌సభ స్థానం రద్దయింది. దీంతో 2009లో కరీంనగర్‌ లోక్‌సభ సభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా గెలి చారు. ప్రస్తుతం కరీంనగర్‌ లోక్‌సభ సభ్యునిగా పోటీ చేస్తున్నారు.

మాజీ మంత్రి పురుషోత్తమరావు
మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తమరావు సొంతూరు పర్వతగిరి మండలం కొంకపాక గ్రామం. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా, 1972లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా వర్దన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో కాంగ్రె స్‌ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1989లో వరంగల్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలిచారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి గా పని చేశారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర హైపవర్‌ కమిటీ చైర్మెన్‌గా పని చేశారు.- గజవెల్లి షణ్ముఖ రాజు,స్టాఫ్‌ రిపోర్టర్‌– వరంగల్‌ రూరల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top