డీజీపీ వాహన తనిఖీ హైడ్రామా!

Vizianagaram Police Inspected The AP DGP Vehicle - Sakshi

విజయనగరం జిల్లాలో పోలీసులు డీజీపీ వాహనాన్ని తనిఖీ చేశారంటూ ప్రచారం

 అదంతా ఉత్తదేనంటున్న పోలీసు వర్గాలు

సాక్షి, అమరావతి :  రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వాహన తనిఖీ హైడ్రామా కొత్త చర్చకు దారితీసింది. విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన శృంగవరపుకోట మండలం బొడ్డవర జంక్షన్‌ వద్ద మంగళవారం పోలీసులు డీజీపీ వాహనాన్ని తనిఖీ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అరకుకు డీజీపీ ఠాకూర్‌ ప్రైవేట్‌ వాహనంలో వెళ్లారు. ఆయన వాహనంతోపాటు ఆయన్ను అనుసరించిన వాహనాలను కూడా పోలీసులు సోదాలు చేశారు. సోదాలు నిర్వహించిన పోలీసులను అభినందించిన ఆయన రివార్డు ఇవ్వాలని విజయనగరం జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసీ మరీ చెప్పారు. సీన్‌ కట్‌ చేస్తే డీజీపీ వాహన తనిఖీ వ్యవహారం అంతా హైడ్రామా అని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అసలు డీజీపీ ఆ దారిలో వెళ్తున్నారంటే ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడం దగ్గర్నుంచి ఆయన ఆ ప్రాంతం దాటే వరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. డీజీపీ ఏ వాహనంలో వచ్చినా మొబైల్, వైర్‌లెస్, వాకీ టాకీలలో స్పష్టమైన ఆదేశాలు ఉంటాయని, అలాంటిది ఆయనెవరో తెలియకుండానే కారు ఆపి తనిఖీలు చేసే సాహసం చేస్తారా? అంటూ పోలీసు వర్గాలు సెటైర్లు పేలుస్తున్నాయి. 

ఎందుకీ డ్రామా?  
ఈ ఎన్నికల్లో అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారంటూ డీజీపీ ఠాకూర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ఆయన వాహనంలోనే ప్రకాశం జిల్లాకు రూ.35 కోట్లు తీసుకెళ్లి టీడీపీ అభ్యర్థులకు ఇచ్చారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఠాకూర్‌ పనిచేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించాలని సీఈసీ ఇచ్చిన ఆదేశాల అమలులోనూ ఠాకూర్‌ జోక్యంపై ఈసీ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.

విశాఖ జిల్లాలో డీజీపీ ఠాకూర్‌
పాడేరు: డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ మంగళవారం విశాఖ ఏజెన్సీ అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించారు. మంగళవారం సాయంత్రం అనకాపల్లి పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో డీజీపీ ఠాకూర్, అడిషనల్‌ డీజీపీ గ్రేహౌండ్స్‌ నలినీ ప్రభాకర్‌ పోలీస్‌ అధికారులతో రహస్య మంతనాలు జరిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top