
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతుందని చంద్రబాబు, ఎల్లో మీడియా చేసిన ఆరోపణలు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రకటనతో అసత్యమని రుజువైనాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం వరస ట్వీట్లు చేశారు.
(చదవండి : ప్రజలంతా లాక్‌డౌన్ పాటిస్తుంటే ‘మాలోకం’ మాత్రం..)
‘వైజాగ్ లో కరోనా కేసులు దాచిపెడుతున్నారని చంద్రబాబు, పచ్చ మీడియా దుర్మార్గపు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యల వల్లే అక్కడ వ్యాధి పెద్దగా ప్రబల లేదని వెల్లడించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బాగా గడ్డి పెట్టాడు. బాబూ! మీ ఏడుపులు ఆగవు, బుద్దులు మారవు.’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘మీడియాలో కనిపించక పోతే బతకలేడు చంద్రబాబు. ఠంచనుగా రోజుకోసారి వీసీల పేరుతో వాయిస్తున్నాడు. ఆయన ఏం చెబూతున్నాడో కాని క్షేత్ర స్థాయిలో పచ్చపార్టీ పెద్ద నాయకులెవరూ సేవా కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ప్రచార పిచ్చి ముదిరి ఆయనిలాగే సోది వేస్తాడులే అని ఉదాసీనంగా ఉన్నాట్టున్నారు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.