వెల్లువెత్తిన విమర్శలు.. వెనుకకు తగ్గిన వసుంధరా రాజే!

Vasundhara Raje govt refers controversial bill to select committee

జైపూర్‌: సర్వత్రా విమర్శల నేపథ్యంలో క్రిమినల్‌ లా బిల్లుపై వసుంధరా రాజే ప్రభుత్వం వెనుకకు తగ్గింది. వివాదాస్పద ఈ బిల్లును అసెంబ్లీ సెలక్ట్‌ కమిటీకి నివేదిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ప్రజాసేవకులపై ఆరు నెలలపాటు విచారణ జరపకుండా రక్షణ కల్పిస్తూ.. రాజస్థాన్‌ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లును సోమవారం విపక్షాల ఆందోళనల నడము అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సర్వత్రా విమర్శల నేపథ్యంలో సీఎం వసుంధరా రాజే పునరాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై వివాదం మరింత ముదరకుండా ప్రభుత్వం సెలక్ట్‌ కమిటీకి బిల్లును నివేదించినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోగా బిల్లును పరిశీలించి..సిఫారసులు చేయాలని కమిటీని ప్రభుత్వం కోరింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, ప్రభుత్వ సిబ్బందిపై ముందస్తు అనుమతి లేకుండా విచారణ జరపకూడదంటూ రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం 180 రోజులపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాసేవలకులపై విచారణ చేపట్టకూడదు. సదరు అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా మీడియా కథనాలు ప్రచురించడానికి వీల్లేదు. ఈ మేరకు మీడియాపై సైతం ఆంక్షలు ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించారు. అవినీతి అధికారులపై మీడియా, విచారణాధికారుల చేతులు కట్టేసేలా తీసుకొచ్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ సహా విపక్షాలన్నీ మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ బిల్లు ద్వారా అవినీతిని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ మండిపడిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top