రైతులను దగా చేసిన కేసీఆర్‌: ఉత్తమ్‌

Uttam Kumar Reddy Fires On KCR - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : చెరుకు, పసుపు రైతులను కేసీఆర్‌ మోసం చేశారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆర్మూర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు, నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామనే హామీలను కేసీఆర్, కవిత నెరవేర్చలేదని అన్నారు. తన మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా కేసీఆర్‌ చోటివ్వలేదని దుయ్యబట్టారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఉత్తమ్‌ వివరించారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసి, క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. ఎర్రజొన్నకు రూ.3 వేల మద్దతు ధర ఇస్తామన్నారు. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామన్నారు. జీఎస్టీని సమీక్షించి బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వీఏఓలకు రూ.10 వేల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మళ్లీ టీఆర్‌ఎస్‌ వస్తే.. పోలీస్‌ రాజ్యమే: కోదండరాం 
రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారు పడిపోకుండా ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసురాజ్యం వస్తుందని ఎద్దేవా చేశారు. నీళ్లడిగిన పాపానికి బాల్కొండలో 144 సెక్షన్‌ విధించారని అన్నారు. నిజాం ప్రభువులు దాశరథిని జైలులో పెడితే కేసీఆర్‌ రైతులపై కేసులు పెట్టించారన్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలోని అన్ని గ్రామాల రైతులు ఆదర్శవంతులని అన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో కూడా ఆదర్శవంతమైన సేద్యం చేస్తున్నారని చెప్పారు. ఉపాధి కోసం దుబాయ్‌ వంటి దేశాలకు వలస వెళుతున్నారని అన్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో ఈ వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ప్రజా కూటమి అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని వివరించారు.

దేశానికి రాహుల్‌ నాయకత్వం అవసరం: గద్దర్‌  
దేశానికి రాహుల్‌గాంధీ నాయకత్వం అవసరమని ప్రజాగాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. భారతదేశం భాగ్యసీమరా.. అనే పాటను పాడి వినిపించారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరమని ఆకాంక్షించారు. తెలంగాణ దొరల పాలైందని, యాగంలో కాలిపోయిందని తన పాట రూపంలో విమర్శించారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, ఏఐసీసీ నాయకులు వి హనుమంత్‌రావు, మధుయాష్కి గౌడ్, మండలి విపక్ష నేత, కామారెడ్డి అభ్యర్థి షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి, బోధన్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నిజామాబాద్‌రూరల్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top