ధనిక రాష్ట్రంలో జీతాలకు కోతలా?

Uttam Kumar Reddy Comments On KCR - Sakshi

ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడాన్ని టీపీసీసీ వ్యతిరేకిస్తోంది

ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఉత్తమ్‌

ఆర్థిక స్థితిపై సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌

ప్రభుత్వ ఖర్చు కంటే దాతల విరాళాలే ఎక్కువ: భట్టి  

సాక్షి, హైదరాబాద్‌: ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపులకు కష్టాలొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దేశంలోనే తెలంగాణను ధనిక రాష్ట్రంగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులకు కేటగిరీల వారీగా కోత విధించి వారిని ఇబ్బందుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడాన్ని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవా రం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో కోతలు విధించడాన్ని తప్పుబట్టిన ఉత్తమ్‌.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

ప్రభుత్వ ఆదాయం అంత పతనమవుతుందా? 
‘కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయానికి కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌ కాలంలో ఆదాయం లేదనే కారణంతో ఉద్యోగులకు ఇచ్చే నెలవారీ వేతనాల్లో కోతలు పెట్టడం సరికాదు. వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అయితే ప్రభుత్వ ఆదాయం అంత పతనమవుతుందా? ఉద్యోగులకు నెలవారీగా వేతనాల కింద రూ.3,500 కోట్లు ఇస్తున్నాం. అంత మొత్తాన్ని సర్దుబాటు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం.

దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. అంతటి ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలివ్వని దౌర్భాగ్యం నెలకొనడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి వేతనాన్ని ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు రూ.72 వేల కోట్లు ఖర్చు చేశారు. మళ్లీ రూ.22 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఉద్యోగులకు వేతనాలివ్వని పరిస్థితిలో ఇంత పెద్ద మొత్తంలో పనులకు టెండర్లు పిలవడం గమనార్హం’అని ఉత్తమ్‌ విమర్శలు గుప్పించారు.  

కొత్త ఆస్పత్రులు కట్టలే.. వసతులు కల్పించలే..: భట్టి 
అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని అరికట్టేందుకు రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేస్తామన్న సీఎం కేసీఆర్‌.. ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ‘కరోనాతో ప్రభుత్వ ఆదాయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రభావం పడలేదు. వారం పది రోజులు బంద్‌ పెడితే ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఖర్చులు చేయలేదు.

కొత్తగా ఆస్పత్రులు కట్టలేదు. కనీసం కొత్త మౌలిక వసతులు కల్పించలేదు. అంతలోనే ఆర్థిక వ్యవస్థ ఇంత పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాతలు ఇచ్చిన విరాళాలు అధికంగా ఉన్నాయి’అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దివాలాకోరుతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కరోనా సంక్షోభమంటూ సాకును చూపుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఎక్కువ కష్టపడుతున్నారని, ఇలాంటి సమయంలో రెట్టింపు వేతనాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం కోతలు పెట్టడం సరికాదని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top