
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గన్‌మన్లను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది టీఆర్‌ఎస్ సర్కారు రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి గన్‌మన్ల తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాల రద్దుపై తాము కోర్టులో పోరాడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గన్‌మన్లను ఉపసంహరించిందని ఆరోపించారు.
కొద్దిరోజుల కింద కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురయ్యారని.. ఇలాంటి సమయంలో వెంకట్‌రెడ్డి గన్‌మన్లను తొలగించడం కక్షపూరిత చర్య కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని, ఎక్కడ ఎవరికి ఎలాంటి హాని జరిగినా ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ తీరు సరికాదు: జానారెడ్డి
వెంకట్‌రెడ్డి గన్‌మన్ల తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రభుత్వ తీరు సరికాదని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఇంటెలిజెన్స్ అధికారులు పునరాలోచించుకోవాలని కోరారు.
తనకు ప్రాణహాని ఉందని కోమటిరెడ్డి ఎప్పటినుంచో చెబుతున్నారని.. ప్రాణహాని ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఇతరులకు సెక్యూరిటీ కల్పిస్తున్న ప్రభుత్వం.. కోమటిరెడ్డికి సెక్యూరిటీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డికి గన్‌మన్లను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కక్షపూరితమని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డికి భద్రతను తొలగించడం దారుణమన్నారు.