‘ఫ్రంట్‌’కు మద్దతు పచ్చి అబద్ధం | Uttam kumar reddy commented over third fornt | Sakshi
Sakshi News home page

‘ఫ్రంట్‌’కు మద్దతు పచ్చి అబద్ధం

Published Wed, Mar 7 2018 2:23 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam kumar reddy commented over third fornt - Sakshi

సాక్షి, నిర్మల్‌/జగిత్యాల: ‘థర్డ్‌ ఫ్రంట్‌.. ఓ పచ్చి అబద్ధం. కేసీఆర్‌ ఆడుతున్న కొత్త నాటకం. ఆయన వెంట ఎవరూ లేరు. తనకున్న పరిచయంతో కేశవరావు మమతాబెనర్జీకి ఫోన్‌ చేసి... కేసీఆర్‌తో మాట్లాడించారు. అందరూ కలిసివస్తే చూద్దామని మాత్రమే మమత చెప్పారు. ఇటు జార్ఖండ్‌ మాజీ సీఎం శిబూసొరేన్‌ కూడా కేసీఆర్‌తో మాట్లాడలేదు. ఈరోజు ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనే ఉంటామని ప్రకటించారు’ అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్‌లో, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. కొడుకును సీఎంను చేసేందుకే కేసీఆర్‌ కొత్త ఫ్రంట్‌ నాటకం మొదలు పెట్టారని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిచే పరి స్థితి లేదని, అలాంటప్పుడు ఇక థర్డ్‌ ఫ్రంట్‌ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. తన ఫ్రంట్‌కు దేశవ్యాప్తంగా మద్దతు వస్తోందంటూ కేసీఆర్‌ పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నా రని మండిపడ్డారు. ఇందుకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని చూపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో రైతు పంటకు మద్దతు ధర కోసం రూపాయి కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం పరామర్శించలేదని తెలిపారు.

మేలో ఇస్తామంటున్న పెట్టుబడి రాయితీ ఎన్నికల స్టంటేనన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎంత ఇచ్చావ్‌..? ఇంటికో ఉద్యోగం ఏమైంది..? దళితులకు మూడెకరాలు ఏమైనయ్‌..? డబుల్‌ బెడ్‌రూం ఎంత మందికి ఇచ్చినవ్‌?’ అని కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే రైతులు రూ.2 లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చి రాగానే బంగారు తెలంగాణ తెస్తా అన్న కేసీఆర్‌ ఇప్పుడు జై భారత్‌ అని నాటకం ఆడుతున్నాడని, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. నీరవ్‌ మోదీ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావనకు రాకుండా పక్కదారి పట్టించేందుకే కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు.  

ఏ టెంటూ లేనోళ్లదే ‘ఫ్రంట్‌’: రేవంత్‌  
దేశంలో ఏ టెంటూ లేకుండా ఉన్నోళ్లదే థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇది కేంద్రంలోని బీజేపీ సెకండ్‌ ఫ్రంటేనని అభివర్ణించారు. బీజేపీ చేతి లో కేసీఆర్‌ కీలుబొమ్మ అని అన్నారు. తెలం గాణ ఉద్యమంలో జెండాలు మోసి.. దండాలు పెట్టి.. ప్రాణాలు తీసుకున్నోళ్లు కనుమరుగయ్యారని,, అంతా కుటుంబ పాలనే సాగుతోందన్నారు.

హీరోయిన్లతోని సెల్ఫీలు దిగుడు.. క్యాట్‌వాక్‌లు చేసుడు తప్ప కేటీఆర్‌కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. చప్రాసీకీ అర్హత లేని కొడుకును సీఎం చేస్తామంటే ప్రజలు ఊరుకుంటారా?, తెలంగాణ కేసీఆర్‌ అబ్బా జాగీరా అన్ని ధ్వజమెత్తారు. బలిదానాలు చేసుకున్నోళ్లను, ఉద్యమంలో పోరాడినోళ్లను మరిచి.. సడ్డకుడి కొడుకు సంతోష్‌రావును రాజ్యసభ సభ్యున్ని చేస్తడట అని నిప్పులు చెరిగారు.  

నక్సల్స్‌ నీ పనిచేస్తరు: వీహెచ్‌
‘నక్సల్స్‌ ఎజెండా అంటూ కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు వాళ్లనే పిట్టల్లెక్క కాల్చి పారేస్తుండు. ఇగ నక్సల్స్‌ నీ పనిచేస్తరు కేసీఆర్‌..’అని సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. 106 సీట్లొస్తాయని సర్వేలు చేసినోళ్లకు కాంగ్రెస్‌ బస్సుయాత్రను చూడగానే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.‘అబద్ధాలు చెప్పే కేసీఆర్‌.. నీతో మూడో ఫ్రంట్‌ అయితదా?’ అని ప్రశ్నించారు. ఈ సభలో  శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి: జానారెడ్డి 
దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టడంతో పాటు అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ హయాంలోనేనని ఆ పార్టీ శాసనసభ పక్షనేత జానారెడ్డి అన్నారు. పేదోళ్లకు రూపాయికే కిలోబియ్యం, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను తీసుకొచ్చింది తమ పార్టీయేనని చెప్పారు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కాంగ్రెస్సే కట్టించిందన్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విస్మరించవద్దన్నారు. రూ.500 కోట్ల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement