గెలిచారు.. నిలిచారు! | Uttam And Komatireddy Venkatreddy And revanth reddy from Congress wins in LS polls | Sakshi
Sakshi News home page

గెలిచారు.. నిలిచారు!

May 24 2019 4:23 AM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam And Komatireddy Venkatreddy And revanth reddy from Congress wins in LS polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతల పరువు నిలబడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ముఖ్య నాయకుల్లో ముగ్గురు విజయం సాధించడంతో పార్టీ ఊపిరి పీల్చుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి తాము పోటీ చేసిన స్థానాల నుంచి గెలుపొందడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కీలక నేతలు బరిలో ఉండటం, టీఆర్‌ఎస్‌ స్వీప్‌ చేస్తుందన్న అంచనాలు రావడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొన్నా ముఖ్య నేతలు ముగ్గురూ విజయం సాధించడం కొంత ఊరటనిచ్చింది.  

కొంచెం కష్టపడి ఉంటే...
ఈ ముగ్గురికి తోడు మరో ఇద్దరు కూడా గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలయ్యాయి. చేవెళ్ల నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్‌ అభ్యర్థి కల్వకుంట్ల మదన్‌మోహన్‌రావు అధికార పార్టీకి ఓ రకంగా చుక్కలు చూపించారు. టీఆర్‌ఎస్‌ కంచుకోట జహీరాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. చేవెళ్లలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. చాలా స్వల్ప తేడాతో ఈ ఇద్దరు ఓటమి పాలు కావడంతో కొంచెం కష్టపడి ఉంటే ఈ స్థానాలు కూడా దక్కేవనే ఆవేదన గాంధీభవన్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  

మిగిలిన వారంతా ఫెయిల్‌...
అలాగే కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య నేతలుగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌ లాంటి నేతలంతా పరాజయం పాలయ్యారు. నిజామాబాద్‌లో అయితే మధుయాష్కీకి వచ్చిన ఓట్లు పార్టీ నేతలను విస్మయపరిచాయి. ఆయనకు కేవలం 7 శాతంతో 65వేలకు పైగా మాత్రమే ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్‌ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు 1.80 లక్షల ఓట్లు రాగా, రేణుకాచౌదరికి దాదాపు 4 లక్షలు, బలరాం నాయక్‌కు 3.15 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు కీలక నేతలు విజయం సాధించడం, మిగిలిన నేతలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రావడం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement