నరహంతక సర్కారు

Ummareddy Venkateswarlu Fires On Chandrababu Govt - Sakshi

శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం  

రైతు కోటయ్య హత్య ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ హత్యే  

కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ  

సాక్షి, అమరావతి బ్యూరో: వెనుకబడిన తరగతులకు చెందిన కౌలు రైతు పి.కోటేశ్వరరావు(కోటయ్య) హత్య ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. పోలీసుల దాడి వల్లే రైతు ప్రాణం పోగొట్టుకున్నాడని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటైన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు బుధవారం రైతు కోటయ్య  కుటుంబాన్ని పరామర్శించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో రైతు హత్య జరిగిన తోట ప్రాంతాన్ని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు. 

ప్రశ్నించినందుకే పోలీసుల దాడి 
రైతు కోటయ్య మృతికి గల కారణాలను ఆయన భార్య, కోడలు, పిల్లలను అడిగి తెలుసుకున్నామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొండవీడు సంబరాల సందర్భంగా కోటయ్య 0.50 సెంట్ల స్థలాన్ని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చాడని చెప్పారు. పోలీసులు కోటయ్య బొప్పాయి తోటలో కాయలు కోసి ధ్వంసం చేయడంతోపాటు కనకాంబరం తోటలో వాహనాలు తిప్పారని తెలిపారు. కోటయ్య అనుమతి లేకుండానే మునగ తోటలో చెట్లను తొలగించి, వాహనాల పార్కింగ్‌ కోసం చదును చేశారని అన్నారు. పోలీసుల ప్రవర్తన  చూసి రెండు రోజులుగా కోటయ్య తీవ్ర ఆవేదన చెందాడని వెల్లడించారు. అదేమిటని గట్టిగా ప్రశ్నించగా పోలీసులు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. 

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి 
పోలీసుల దాడిలో ప్రాణం పోగొట్టుకున్న కోటయ్య మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి కట్టుకథలు అల్లారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటయ్యకు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అప్పులు ఉంటే గతంలోనే తీర్చేశాడని అన్నారు. 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కష్టపడి సాగు చేసుకుంటున్న ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.  పోలీసు దర్యాప్తుతో వాస్తవాలు బయటకు రావని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పంచనామా మొదలు పోస్టుమార్టం వరకు సక్రమంగా జరగలేదని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి, మంత్రి దుశ్చర్య వల్లే..  
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దుశ్చర్య వల్లే కోటయ్య మృతి చెందాడని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తాము రూ.3 లక్షలు, చంద్రన్న బీమా కింద రూ.2 లక్షలు ఇస్తామంటూ ఆర్డీవో, డీఎస్పీ బేరసారాలు సాగించారని చెప్పారు. వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికే డబ్బులు ఎర వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పెడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల ఒక బీసీ రైతు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. దీనిపై వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారని తెలిపారు. కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, పాదర్తి రమేష్‌గాంధీ, శ్రీనివాసులురెడ్డి తదితరులు ఉన్నారు.

కోటయ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం 
కష్టాల్లో ఉన్న కోటయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరుపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. సంఘటన జరిగిన రోజు చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బాధిత కుటుంబానికి రూ.లక్ష ఇచ్చారు. మిగిలిన రూ.4 లక్షలను నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అందించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం కోటయ్య కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. మొత్తం మీద వైఎస్సార్‌సీపీ తరుపున రూ.10 లక్షలు అందజేశారు. 

టీడీపీకి రైతులు, బీసీలంటే చులకన 
‘‘కోటయ్య మృతి ఘటనతో తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి బయటపడింది. ఆ పార్టీ రైతులు, బీసీల పట్ల చులకనభావం ప్రదర్శిస్తోంది. పోలీసులు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడం వల్లే కోటయ్య చనిపోయాడు. పరామర్శకు వచ్చేవారిని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి. రైతు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే కారణం. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, కౌలు రైతు అని చులకన భావం ఉండబట్టే ఈ సంఘటన జరిగింది. ఈ హత్యోదంతాన్ని ఇంతటితో వదిలిపెట్టం, పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం’’ 
– కొలుసు పార్థసారథి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత 

ప్రచార్భాటాలకు నిండు ప్రాణం బలి 
‘‘ప్రభుత్వ పెద్దలు తమ ప్రచార ఆర్భాటాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. పోలీసుల దాష్టీకం వల్లే రైతు కోటయ్య చనిపోయాడు.  రైతు ప్రాణానికి టీడీపీ నాయకులు రేటు కట్టే యత్నం చేశారు. ఈ వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మొదటి ముద్దాయి. రైతు మరణంపై న్యాయ విచారణ జరిపించాలి’’ 
– మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు 

ముఖ్యమంత్రి, మంత్రి బాధ్యత వహించాలి
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పుల్లారావు బాధ్యరాహిత్యం కారణంగానే రైతు కోటయ్య చనిపోయాడు. కోటయ్యకు చెందిన బొప్పాయి, మునగ, కనకాంబరం తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. బలవంతంగా పొలాన్ని ఆక్రమించుకున్నారు, అదేమని ప్రశ్నిస్తే భౌతికంగా దాడి చేశారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఏమీ చేయలేడన్న అహంభావంతో ఈ హత్య చేశారు. దీనికి ముఖ్యమంత్రి, మంత్రి పుల్లారావు బాధ్యత వహించాలి’’ 
– జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు  

ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదయ్యా..
వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ఎదుట కోటయ్య భార్య ప్రమీల తమ గోడు వెళ్లబోసుకుంది. ‘‘మా ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదయ్యా.. పది మందికి చెప్పేవాడయ్యా.. గుండె నిబ్బరం ఎక్కువ. భయమంటే ఎరుగనివాడు’’ అంటూ బోరున విలపించింది. పోలీసులు కొట్టిన దెబ్బలకే చనిపోయాడని రోదించింది. తమ నాన్న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోలేదని కోటయ్య వెంకటలక్ష్మి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రమంతటా అందరికీ తెలిసేలా చెప్పాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులను కోరారు. 

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు 
‘‘మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో పెద్ద మనుషులను తీసుకుని ఆటోలో పొలం వద్దకు వెళ్లాం. అయితే, ఆటో వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. ముఖ్యమంత్రి వస్తున్నాడు, వెళ్లడానికి కుదరంటూ కదలనీయలేదు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరం చూపలేదు. ఈలోపు పోలీసులు విద్యుత్‌ శాఖ వాహనంలో నా తండ్రి శవాన్ని తీసుకొచ్చి చెక్‌పోస్టు వద్ద వదిలేశారు. మేము డాక్టర్‌ వద్దకు తీసుకెళితే చనిపోయాడని చెప్పారు. పురుగు మందు తాగితే నురుగు వస్తుంది. కానీ, మా నాన్న నోటి నుంచి రక్తం వచ్చింది. ముఖం వాచి ఉంది. పొలంలోకి వెళ్లిన గంటలోపే నాన్న చనిపోయాడు’’ అంటూ రైతు కోటయ్య కుమారుడు వీరాంజనేయులు విలపించారు. 

అడుగడుగునా పోలీసుల ఆంక్షలు 
పోలీసుల దాడిలో మరణించిన రైతు కోటయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కొత్తపాలెం గ్రామానికి వెళ్లే దారుల్లో ఐదు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోట గ్రామం వద్ద డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు సభ్యులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరామర్శకు వెళితే తప్పేంటి? ఆంక్షలు ఎందుకని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. వాహనాలను అనుమతించకపోయినా కాలినడకనైనా గ్రామానికి వెళ్లి తీరుతామంటూ బయల్దేరారు. చివరకు కమిటీ సభ్యుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. మిగతా వారు వెళ్లకూడదా అని వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీయడంతో వారి వాహనాలను కూడా అనుమతించారు. కొత్తపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, వందలాది మంది పోలీసులు గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top