ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారు

Ummareddy Venkateswarlu Comments On Chandrababu - Sakshi

స్పీకర్, గవర్నర్‌లకు కళంకం వచ్చేలా చేశారు

చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి 

సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చంద్రబాబు రాజ్యాంగాన్ని అవమానించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శాసనమండలిలో సోమవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని వారిపై అనర్హత వేటు పడనీయకుండా స్పీకర్‌ పదవికి కళంకం తెచ్చారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి గవర్నర్‌ను కూడా వేలెత్తి చూపే పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్పందించలేదన్నారు.

మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్య విలువలకు మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరే ముందు ఎమ్మెల్సీ పదవికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో నంద్యాల నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు టీడీపీ కండువా కప్పారన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరితే తమ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది చంద్రబాబేనన్నారు. నిషే«ధిత ప్రాంతంలో నిర్మించిన ప్రజా వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు.. సీఎంకు లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

‘హోదా’పై శాసనమండలిలో చర్చ
ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాడుతుంటే సీఎం మాత్రం కేంద్రంలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు మన అవసరం లేకుండా పోయిందంటూ మాట్లాడటం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు బొత్స, అవంతిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడినట్లు చంద్రబాబు ఏనాడైనా గట్టిగా మాట్లాడారా అని ప్రశ్నించారు.

హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే సభలో తలవంచుకుని నిలబడతానంటూ బొత్స సవాల్‌ చేశారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు మనమూ చేద్దామంటూ తాను టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే అందుకు ఆయన ఒప్పుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదని చెప్పారు. హోదా విషయంలో వైఎస్‌ జగన్‌ తీరు మొదటి నుంచి ఒకేలా ఉందన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top