హోదాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది: ఉమెన్‌ 

Umen Chandi And Raghuveera Slams BJP And TDP In Eluru - Sakshi

ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్‌ చాందీ స్పష్టం చేశారు. ఏలూరులో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశం గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు అని యూపీఏ ప్రతిప్రాదిస్తే కాదు పదేళ్లు ఇవ్వాలన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో నాలుగేళ్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తాజా తీర్పుపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కాపులకు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ వెనుకడుగు వేయడం దారుణమన్నారు. 25 మంది ఎంపీలుంటే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని వైఎస్ జగన్ ఎలా అన్నారు...ప్రత్యేక హోదా కూడా కేంద్ర పరిధిలోనిదే కదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వగలదన్నారు. ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేవని చెప్పారు. ఏపీలో 44000 బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్ల గురించి నేను ఎలా మాట్లడతా..నేను ఏపీకి మాత్రమే ఇన్చార్జిని అని స్పష్టం చేశారు. తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి...అదే విధంగా ఏపీలో కూడా ఇబ్బందులు రాకుండా రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు.

కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి
ఏపీకి జరిగిన అన్యాయంపై, పార్లమెంట్లో అవిశ్వాసం చర్చపై  మొదట మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎన్‌డీఏపై అవిశ్వాసంపై టీడీపీతో పాటు మిత్ర పక్షాలు కూడా నోటీసులు ఇచ్చాయని..టీడీపీ నోటీసులకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం ముఖ్యమంత్రి స్ధాయికి తగదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు ఎన్‌డీఏలో ఉండి ఇపుడు బయటకు వచ్చి కొంగ దీక్షలు చేస్తే జనం ఒప్పుకోరు...ఎవరూ నమ్మరని విమర్శించారు. ప్రత్యేక హోదా పై ఏఐసీసీ సమావేశంలో తీర్మానం చేశాం...రాహుల్ ప్రధాని అయిన వెంటనే తొలిసంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తప్పితే ఏపీకి మరే పార్టీ న్యాయం చేయలేవని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top