తీర్థయాత్రలా ఎన్నికల ప్రచారం | Uddhav Thackeray to attend Amit Shahs NDA dinner meet | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలా ఎన్నికల ప్రచారం

May 22 2019 1:13 AM | Updated on May 22 2019 1:13 AM

Uddhav Thackeray to attend Amit Shahs NDA dinner meet  - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం తీర్థయాత్ర మాదిరిగా సాగిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలు భిన్నం అన్న ఆయన.. కేవలం పార్టీయే కాకుండా ప్రజల పోరాటంగా ఈ ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర మంత్రులను కలిసి, దేశానికి సేవలందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం, 23వ తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ‘కృతజ్ఞతాపూర్వక సమావేశం’ ఏర్పాటు చేశారు. ‘గతంలో ఎన్నో ఎన్నికలు చూశా.

కానీ, ప్రస్తుత ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగాయి. ఈసారి ప్రజలే ఎన్నికల పోరాటంలో పాల్గొన్నారు. అందుకే ఈసారి ఎన్నికల ప్రచారం తీర్థయాత్ర మాదిరిగా సాగిందనిపించింది’ అని ప్రధాని అన్నారని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విలేకరులకు తెలిపారు. అనంతరం అమిత్‌ షా ట్విట్టర్‌లో..‘గత ఐదేళ్లలో ఎంతో కృషి చేసి గొప్ప విజయాలు సాధించిన మోదీ సర్కార్‌ టీంకు కృతజ్ఞతలు. నరేంద్ర మోదీ నేతృత్వంలో నవీన భారత నిర్మాణానికి ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, గడ్కరీ, జైట్లీ, జేపీ నడ్డా, ప్రకాశ్‌ జవడేకర్‌ తదితరులతో పాటు ఎన్‌డీఏలోని లోక్‌జన్‌ శక్తి పార్టీకి చెందిన పాశ్వాన్, అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్, అప్నాదళ్‌ నుంచి అనుప్రియా పటేల్‌ ఉన్నారు.

ఎన్‌డీఏ నేతలకు విందు
సాయంత్రం స్థానిక అశోకా హోటల్‌లో అమిత్‌ షా నేతృత్వంలో ఏర్పాటైన విందుకు శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ప్రకాశ్‌సింగ్‌ బాదల్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, జేడీయూ చీఫ్, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితర కూటమి నేతలంతా పాల్గొన్నారు. వీరందరినీ ప్రధాని మోదీ శాలువా కప్పి సన్మానించారు. ఈ విందు కేవలం మర్యాద పూర్వకంగా ఏర్పాటు చేసింది మాత్రమేనని పార్టీ ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేంత మెజారిటీ దక్కినప్పటికీ కొత్త ప్రభుత్వంలో వారిని కూడా కలుపుకుని పోయేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం: మోదీ
అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలని అధికార పార్టీ నేతలు యోచిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఈవీఎంలపై అనవసర వివాదం సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు చెందిన 36 పార్టీల నేతలు ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. 2022 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశాన్ని సంపన్న, బలమైన, అభివృద్ధి చెందిన, సమ్మిళిత భారత్‌గా మార్చేందుకు కట్టుబడి ఉంటామంటూ ఈ సందర్భంగా ఒక తీర్మానం చేసినట్లు  కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. ఎన్‌డీయేతర మూడు పార్టీల నేతలు కూడా మద్దతు తెలుపుతూ లేఖలు పంపినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement