
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. రేవంత్ కోసం తాను ఎంతో చేశానని, కష్టసమయంలో అండగా నిలిచానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో చిచ్‌టాచ్ చేసిన రమణ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాకు చెప్పకుండా ఢిల్లీకి ఎందుకెళ్లారు? : ‘‘రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైనప్పుడు అతనికి మద్దతుగా అన్ని పార్టీలనూ కూడగట్టింది నేనే. కష్టసమయాల్లో అతనికి అండగా నిలిచాను. అసలు రేవంత్ వైఖరి వల్లే టీడీపీకి బీజేపీ దూరమైంది. పార్టీ అధ్యక్షుడినైన నాతో చెప్పకుండా రేవంత్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఒకవేళ కోర్టు పనులే అయిఉంటే అందులో దాచడానికి ఏముంటుంది?’’ అని రమణ వాపోయారు.
బాబు రాగానే చర్యలు : అటు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను, ఇటు పాలమూరులో ఎమ్మెల్యే డీకే అరుణను కలవడంపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాల్సిందేనని, అప్పటిదాకా ఆయనను పార్టీ సమావేశాలకు రానిచ్చేదిలేదని రమణ స్పష్టం చేశారు. క్రమశిక్షణను ధిక్కరిస్తే ఎవ్వరినైనా ఉపేక్షించబోమని, విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు తిరిగి రాగానే రేవంత్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే తప్పేంటి? : ఏపీ టీడీపీ మంత్రులు, నాయకులకు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తూ, ఫ్యాక్టరీల ఏర్పాటులో సహకరిస్తోందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైనా ఎల్.రమణ స్పందించారు. ‘‘అసలు ఏపీ టీడీపీ నేతలు తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే తప్పేంటి?’ అని ప్రశ్నించారు. కాగా, రేవంత్ నిష్క్రమణకు మూల కారణంగా భావిస్తోన్న ‘టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు’ అంశంపై రమణ ఆచితూచి స్పందించారు. పొత్తుల గురించి ఇప్పుడు అనవసరమని, ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని అన్నారు.