కేసీఆర్‌కు సాలిడ్‌ పంచ్‌

TS BJP Chief Laxman Strongly Reacts On KCR Comments - Sakshi

కౌంటరిచ్చిన టీబీజేపీ చీఫ్‌ లక్ష్మణ్‌

రైతులకు బేడీలు, నిర్బంధాలే గుణాత్మక మార్పా?

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాల తీరు, ప్రత్యామ్నాయ కూటమి(ఫ్రంట్‌) ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది.  వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ చీఫ్‌ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ మండిపడ్డారు.

‘‘గుణాత్మక మార్పు అంటే ఏంటి? ‘కేసీఆర్‌ పదేపదే గుణాత్మక మార్పు మాట చెప్పారు. దళితుణ్ని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానని, ఆ తర్వాత తానే పీఠమెక్కడం, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం, అన్నంపెట్టే రైతులకు బేడీలు వేయడం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను నిర్బంధించడం, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం.. ఇదేనా గుణాత్మక మార్పు? ఇంతకుముందు చెప్పిన ఒక్కమాటకైనా కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమేనా?

ఫ్రంట్‌కు టెంట్‌ కూడా దొరకదు : 70 ఏళ్లుగా సాధ్యంకాని అభివృద్ధిని మోదీ ఈ 4 ఏళ్లలో చేసి చూపారు. అందుకే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్‌.. ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీలను పోగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా దేశప్రజలు ఎన్నో ఫ్రంట్లను(కూటములను) చూశారు. సుస్థిరమైన నాయకత్వం కోసమే బీజేపీకి ఓటేసి నరేంద్ర మోదీని ప్రధానిని చేశారు. కేసీఆర్‌లాంటి వాళ్లు పెట్టే ఫ్రంట్లకు టెంట్లు కూడా దొరకవు.

మోదీని తిట్టి, తిట్టలేదంటారా? : వాపును చూసి బలుపుగా భ్రమిస్తున్న కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధాని అనే గౌరవంలేకుండా మోదీని తిట్టారు. కేసీఆర్‌ పొరపాటున నోరుజారాడని వారి సంతానం కేటీఆర్‌, కవితలే అంగీకరించారు. ఇప్పటికైనా ఆయన తప్పును ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. గత అసెంబ్లీలో కనీసం ఒక్క స్థానం కూడా లేని బీజేపీ త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. రేపు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలోనూ మాదే విజయం ’’ అని లక్ష్మణ్‌ అన్నారు.

బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న లక్ష్మణ్‌, ఇతర నాయకులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top