ఎమ్మెల్సీ వెంట వెళ్లేదెవరో.!

TRS Party to Suspend MLC Bhupathi Reddy? - Sakshi

ఇంటలిజెన్స్‌ ఆరా..

భూపతి రెడ్డి సస్పెన్షన్‌పై ఉత్కంఠ

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి సస్పెన్షన్‌ వ్యవహారం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం విదితమే. ఈ లేఖను జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి తుల ఉమ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ మేరకు భూపతిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తే టీఆర్‌ఎస్‌ను విడిచి వెళ్లేవారు ఎవరుంటారనే అంశంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన అనుచరులు ఎవరు., ఏ మేరకు ప్రభావం పడుతుంది అనే అంశాలపై ఇంటలిజెన్స్‌ అ ధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కాగా సస్పెన్షన్‌పై జిల్లా ప్రజాప్రతినిధుల నిర్ణయం నేపథ్యంలో భూపతిరెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.

సీఎం నిర్ణయంపై ఉత్కంఠ
భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు సంబంధించి అధినేత కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చి న లేఖ మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తు న్నట్లు సీఎం ప్రకటిస్తారా? లేక పార్టీ క్రమశి క్షణ సంఘానికి సిఫార్సు చేస్తారా అనే అం శంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గు రువారం సీఎం కేసీఆర్‌ నిర్ణయం వెలువడుతుందని భావించినప్పటికీ ప్రకటన రాలేదు. దీంతో ఈ ఉత్కంఠ రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ తరలివెళ్లిన అనుచరులు..
విషయం తెలుసుకున్న భూపతిరెడ్డి అనుచరవర్గం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు భూపతిరెడ్డిని కలిశారు.
డీఎస్, బాజిరెడ్డిల మధ్య కూడా

ఆధిపత్య పోరు..
రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డికి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్యే కాకుండా, రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్‌తోనూ ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం విదితమే. డీఎస్‌ ప్రతిపాదించిన శ్మశాన వాటికల నిర్మాణం పనులకు బాజిరెడ్డి అనుచరవర్గం ఎంపీపీలు తీర్మానం చేయకుండా అడ్డుకున్న విషయం ఇటీవల ఈ నేతల మధ్య ఆధిపత్యపోరును రచ్చకీడ్చింది. గతంలో బాజిరెడ్డి ప్రతిపాదించిన ఉపాధి హామీ పనులను తీర్మానం చేయకుండా డీఎస్‌ అనుచర ఎం పీపీ అడ్డుకున్న విషయం విదితమే. ఇప్పుడు భూపతిరెడ్డిపై సస్పెన్షన్‌ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో డీఎస్‌ వర్గీయుల వ్యవహార శైలి ఆసక్తికరంగా మారింది.

క్రమశిక్షణ తప్పినందుకే..
♦ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్‌ చేయాలని  తీర్మానించాం
♦ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): క్రమశిక్షణ తప్పినందుకే ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్‌ చేయాలని ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులందరం  తీర్మానం  చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన పదవిని, గౌరవాన్ని కళ్లకు అద్దుకొని కాపాడుకోవాలని.. ఆ విధంగా భూపతిరెడ్డి నడుచుకోలేదన్నారు. ఎంత ఎదిగితే అంత ఒదగాలని పెద్దలు చెప్పారని అన్న మంత్రి మితిమీరితే ఎం తటివారైన సరే వారిపై చర్యలు తప్పవన్నారు. ఒకసారి పొరపాటు జరిగితే దా నిని సరిదిద్దుకోవలే తప్ప మళ్లీ మళ్లీ చేయడం ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు, కార్యకర్తలకు  ఇబ్బంది వస్తుందన్నారు.

భూపతిరెడ్డికి సీఎంతో పాటు తాను, ఎం పీ, ఎమ్మెల్యేందరూ పిలిపించుకుని చెప్పినప్పటికీ ఆయన వైఖరి మారలేదన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యేకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడం, వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అక్కడ గ్రూపు లు ఏర్పడ్డాయన్నారు. ఇది సంప్రదాయం కాదన్నారు. పార్టీ సూచనలు పాటించకుండా పదవులు ఉన్నాయని ఆహంకారంతో భిన్నంగా, విరుద్ధంగా వెళ్లిన వారు ఎవరైనా సరే పార్టీకి, ప్రభుత్వానికి అతీతులు కారని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top