జమిలికి టీఆర్‌‘ఎస్‌’ 

TRS Party Support For Jamili Elections In India - Sakshi

ఏకకాలంలో ఎన్నికలే ఉత్తమం

కేసీఆర్‌ రాసిన లేఖను న్యాయ కమిషన్‌ చైర్మన్‌కు అందించిన ఎంపీ వినోద్‌ 

విడివిడి ఎన్నికలతో సమయం, ప్రజాధనం వృథా 

పార్టీలు, అభ్యర్థులు రెండుసార్లు ఎన్నికల వ్యయాన్ని భరించాలి 

‘జమిలి’కి వ్యతిరేకం: టీడీపీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అభిప్రాయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు న్యాయ శాఖ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ చౌహాన్‌కు లేఖ రాశారు. ఎంపీ వినోద్‌కుమార్‌ ఆదివారం ఢిల్లీలో లా కమిషన్‌ సమావేశానికి హాజరై సీఎం రాసిన లేఖను ఆయనకు అందజేశారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.

లోక్‌సభ, అసెంబ్లీలకు విడిగా ఎన్నికల వల్ల ప్రతిసారీ 4 నుంచి 6 నెలల పాటు అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల పనుల్లో గడపాల్సి వస్తోందని, దీనివల్ల రాష్ట్రాల్లో ప్రజాధనం వృథా అవుతోందని వివరించారు. అంతేకాకుండా ఐదేళ్ల కాలంలో రాజకీయ పార్టీలు, అభ్య ర్థులు రెండుసార్లు ఎన్నికల వ్యయాన్ని భరించాల్సి వస్తోందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ఏడాది కాలంపాటు ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమవుతోందని, ఎన్నికల కోడ్‌ వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గం అని లేఖలో సీఎం వివరించారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా లా కమిషన్‌ అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. 

గతంలోనే న్యాయశాఖ నివేదిక ఇచ్చింది: వినోద్‌ 
దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రధాని మోదీ, నీతి ఆయోగ్‌ల అజెండా కాదని, 1983లోనే దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ నివేదిక ఇచ్చినట్లు సమావేశం అనంతరం ఎంపీ వినోద్‌కుమార్‌ మీడియాకు వివరించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి.

లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు మళ్లీ ఏటా ఇతర రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎంతో సమయం, ప్రజాధనం వృథా అవుతోంది. దీన్ని అరికట్టేందుకు దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’’అని వినోద్‌ పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top