
బీజేపీ జాతీయ అధ్యక్షులలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఎంపీ జితేందర్ రెడ్డి
తన మీద సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగిందో కేసీఆర్ జవాబు చెప్పడం లేదని...
ఢిల్లీ: టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత జితేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు. జితేందర్ రెడ్డి చేరికలో బీజేపీ అగ్రనేత రాంమాధవ్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడంతో మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి కాకుండా మరో నేత మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించడంతో నాలుగైదు రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం జితేందర్ రెడ్డి పార్టీలో చేరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లోక్ సభ సీటు ఇవ్వలేదని తాను ఎప్పుడూ బాధపడలేదన్నారు. తన మీద సర్జికల్ స్ట్రైక్ చేశారని, పదవి కోసం తానెప్పుడూ ఆశపడలేదన్నారు. చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ల వరకు సేవ చేయడానికి అందరూ కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రంలో టికెట్ ఇవ్వకపోతే దేశంలో సేవ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తనకు అవకాశం ఇవ్వకపోయినా మోదీ అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పటినుంచి తెలంగాణ ప్రజల కోసం మరింత కష్టపడతానన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడేలా చూస్తామన్నారు. డీకే అరుణ గెలుపు కోసం తప్పకుండా కృషి చేస్తానన్నారు.
తన మీద సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగిందో కేసీఆర్ జవాబు చెప్పడం లేదన్నారు. ఈ నెల 21న తన పేరు లిస్టులో లేని సమయం నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా కేసీఆర్ చేయలేదన్నారు. పుట్టినరోజు నాడు చాలా ఆప్యాయంగా ముద్దు పెట్టి పలకరించిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని, ఇంకా బీజేపీలో చేరడానికి చాలా మంది క్యూలో ఉన్నారన్నారు. బీజేపీలో మంచి స్థానం ఉంటుందని అమిత్ షా నుంచి హామీ లభించిందని తెలిపారు.